జూలూరుపాడు, ఏప్రిల్ 16 : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీన ఖమ్మం నగరంలో నిర్వహించనున్న పార్టీ ‘మినీ ప్లీనరీ’ సమావేశాన్ని విజయవంతం చేయాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు లకావత్ గిరిబాబు పిలుపునిచ్చారు. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలోని మమత మెడికల్ కాలేజీ గ్రౌండ్లో ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ ప్లీనరీ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుతో పాటు జిల్లాకు చెందిన కీలక నేతలు పాల్గొంటారని తెలిపారు. వైరా నియోజకవర్గ పరిధిలోని మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలతో పాటు పీఏసీఎస్ మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. పార్టీ ఆవిర్భావ స్ఫూర్తిని చాటేలా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని ఈ మినీ ప్లీనరీని భారీ విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.