Fatigue | ఇటీవలి కాలంలో ఎందుకింత అలసటగా ఉంది? అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తోంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ సమస్య మరింత పెరిగింది. తక్కువ శక్తి స్థాయిలు లేదా నిరంతర అలసట ఆరోగ్యం, పనితీరు రెండింటిపైనా ప్రభావం చూపుతాయి. దీని వల్ల ఏకాగ్రత తగ్గిపోవడం, పనుల్లో పనితీరు పడిపోవడం జరుగుతుంది. అలాగే దీర్ఘకాలిక అలసట ఒత్తిడి, ఆందోళనలకు దారితీస్తుంది. ఇమ్యూనిటీ కూడా బలహీనపడే అవకాశం ఉంటుంది. అసలు అలసటగా ఎందుకు అనిపిస్తుంది.. దీనికి గల కారణాల గురించి వైద్యులు వివరాలను తెలియజేస్తున్నారు.
వాతావరణ మార్పులు శరీర శక్తి స్థాయిలను ప్రభావితం చేస్తాయి. మేఘావృతమైన వాతావరణం, అధిక ఆర్ద్రత (humidity), ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పులు సర్కేడియన్ రిథమ్, హార్మోన్ సమతుల్యాన్ని దెబ్బతీస్తాయి. చలికాలంలో శరీరం వేడి నిలుపుకోవడానికి ఎక్కువ శక్తిని వినియోగిస్తే, వేడి, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు అలసట, నిస్సత్తువ పెరుగుతాయి. అలాగే అకస్మిక వాతావరణ మార్పుల కారణంగా కూడా అలసటగా అనిపిస్తుందని చెప్పవచ్చు. కొన్ని రోజులు వేడి, వెంటనే చల్లని గాలి, మళ్లీ తేమగా ఉండడం.. ఇలా వాతావరణం మారుతూ ఉంటే శరీరం దానికి సరిపోయేలా పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో శరీరం ఎక్కువగా శ్రమపడటంతో అలసటగా అనిపిస్తుంది. నిద్రలో అంతరాయం వల్ల కూడా అలసటగా ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. వాతావరణ మార్పులు నిద్ర నాణ్యతపై ప్రభావం చూపుతాయి. రాత్రిళ్లు వేడి లేదా ఉష్ణోగ్రత మార్పుల వల్ల నిద్ర సరిగ్గా పడకపోవచ్చు. నిద్ర పూర్తిగా లేకపోతే ఉదయం లేవగానే అలసట కొనసాగుతుంది. అలాగే వేడి, తేమ ప్రభావం కూడా అలసటపై ప్రభావం చూపిస్తాయి. ఇంట్లో ఉన్నా కూడా బయట వాతావరణానికి అనుగుణంగా శరీరం స్పందిస్తుంది. చిన్న పనులు కూడా ఎక్కువ శ్రమగా అనిపించడం, త్వరగా అలసిపోవడం జరుగుతుంది.
ఇక వాతావరణం అనుకూలంగా లేకపోతే బయటకు వెళ్లడం, వ్యాయామం చేయడం తగ్గిపోతుంది. ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిద్రించడం అలవాటవుతుంది. ఈ మార్పులు శరీరాన్ని మరింత మందగింపజేస్తాయి. అదే విధంగా డీహైడ్రేషన్ (ద్రవాల లోపం) కూడా అలసటకు ఒక కారణం. వేసవికాలం కాకపోతే చాలా మంది నీరు తక్కువగా తాగుతారు. కానీ వాతావరణ మార్పుల వల్ల శరీరం ద్రవాలను కోల్పోతూనే ఉంటుంది. స్వల్ప డీహైడ్రేషన్ కూడా అలసటకు కారణమవుతుంది. అలాగే మేఘావృతమైన వాతావరణం, తేమ గాలి, నిరంతర మార్పులు మనసుపై కూడా ప్రభావం చూపుతాయి. మూడ్ తగ్గితే, దానికి అనుగుణంగా శక్తి స్థాయిలు కూడా తగ్గిపోతాయి. ఈవిధంగా వాతావరణ మార్పులు, తక్కువ శక్తి స్థాయిలు కలిసి ఒక అలసట చక్రాన్ని సృష్టిస్తాయి. ఇది అసాధారణం కాదు.. శరీరం పరిసరాలకు స్పందిస్తోంది, అంతే. కాబట్టి రోజువారీ అలవాట్లను స్థిరంగా ఉంచడం ముఖ్యం. సమయానికి భోజనం చేయడం, సరిపడా నిద్రపోవడం, తగినంత నీరు తాగడం, రోజూ కొంత శారీరక కదలిక చేయడం అవసరం. అయితే అలసట కొన్ని వారాల పాటు కొనసాగితే లేదా రోజువారీ పనులను ప్రభావితం చేస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.