Kotam Reddy : నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు రూ.650 కోట్లతో భారీ ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. మనుమసిద్ది నగర్లో రూ.2 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోటంరెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రగతిపై తన ప్రణాళికను వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సహకారంతోనే జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని కోటంరెడ్డి అన్నారు. ఇప్పటికే కొన్ని పనులు పూర్తికాగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తలకు కూడా ఉన్నత పదవులు దక్కుతాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే, పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించి చంద్రబాబు, లోకేశ్ నేరుగా పదవులు ఇస్తున్నారని చెప్పారు.
నాయకులు ఎప్పుడూ ప్రజల మధ్య ఉండి పనిచేయాలని కోటంరెడ్డి హితవు పలికారు. చెమట కారేలా కష్టం చేస్తేనే గుర్తింపు ఉంటుందని అన్నారు. కేవలం ఎమ్మెల్యే తమ్ముడిననో లేక సోగ్గా చొక్కాలు వేసుకుని తిరిగితేనో పదవులు రావని ఆయన సొంత పార్టీ నేతలకు సూచనలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేత గిరిధర్ రెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.