సిద్దిపేట జిల్లా : సిద్దిపేట నియోజకవర్గం నంగునూర్ మండలం పాలమాకుల గ్రామంలో శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, మాజీ మంత్రి హరీష్ రావులు పండగ సాయన్న, కొరివి కృష్ణస్వామి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రముఖుల విగ్రహాలను పెట్టుకుని గుర్తించుకుంటున్నామని, మన ప్రముఖుల చరిత్రలు బయటకు వస్తున్నాయని అన్నారు.
కృష్ణ స్వామి విగ్రహాలను హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలో నలుమూలల ఏర్పాటు చేస్తున్నారని, ఆయన చరిత్ర చాలా గొప్పదని హరీష్‌రావు, బండ ప్రకాశ్ అన్నారు. బలహీన వర్గాల కోసం ఆయన గ్రంథాలను రచించారని, ఆనాటి నిజాం కాలంలోనే ఆయనకు గుర్తింపు ఉందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డ తరవాత మొదటి మేయర్ కృష్ణ స్వామి అని గుర్తుచేశారు. ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారని చెప్పారు.
పండుగ సాయన్న భూస్వాములకి వ్యతిరేకంగా పోరాటం చేశాడని, పెద్దోన్ని కొట్టు పేదలకు పెట్టు అనే నినాదంతో ఆయన పని చేశాడని అన్నారు. ఆ కాలంలో పండగ సాయన్న అంటేనే హడల్ అని, పండగ సాయన్న సమాజ శ్రేయస్సు కోసం పనిచేశాడని చెప్పారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేవల్ కిషన్ జాతరను అధికారికంగా ప్రకటించి నిధులు విడుదల చేశారని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లయినా పేద ముదిరాజ్‌లకు సంక్షేమ పథకాలు అందడం లేదని చెప్పారు.
కేసీఆర్ చేయించిన సమగ్ర కుటుంబ సర్వేవల్ల ముదిరాజ్‌లు అధిక సంఖ్యలో ఉన్నారని తెలిసిందన్నారు. కేసీఆర్ హయాంలోనే మత్సకారులకు వాహనాలు పంపిణీ చేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్లకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, హామీలను నెరవేర్చకుంటే యుద్ధానికి కూడా సిద్ధమని హెచ్చరించారు.