Manchireddy Kishan Reddy | ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 8 : అబద్దాలతో కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్ను బొంద పెట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు నడుం బిగించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్ది అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు బుగ్గరాములు అధ్యక్షతన నిర్వహించారు.
ఈసందర్బంగా మంచిరెడ్డి కిషన్ రెడ్ది మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అమలు కాని అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలను నట్టేట ముంచిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడితే, కాంగ్రెస్ సర్కారు వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు.
గ్రామాల్లో కనిపించని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే…
ప్రజల ఓట్లతో గెలుపొంది గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాల్సిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పెత్తందారిగా వ్యవహరిస్తున్నారని మంచిరెడ్డి కిషన్ రెడ్డి విమర్శించారు. సమస్యలు పరిష్కరించాలని తమ వద్దకు వెళ్లిన కార్యకర్తలను గ్రామీణ ప్రాంత ప్రజలను పట్టించుకోవటం లేదని తెలిపారు. అతనితోపాటు వెళ్లిపోతున్న ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కోట్లాది రూపాయల నిధులతో తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకుంటుంటే, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాత్రం ప్రజల ఓట్లతో గెలుపొంది ప్రజలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతున్నప్పటికీ ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఏ అభివృద్ధి పనికి కూడా తట్టెడు మట్టి పోయలేదని విమర్శించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలని క్యాంప్ కార్యాలయాలు నిర్మించి ఇచ్చారని.. కానీ అది ఇబ్రహీంపట్నంలో ఎందుకు పనికి రాకుండా పోయిందని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ క్యాంపు కార్యాలయంలో నివాసం ఉన్నానని ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు పరిష్కరించేవాడని తెలిపారు.
బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందుల గురి చేస్తే ఊరుకునేది లేదు..
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలను కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పోలీసుల అండదండలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. మా కార్యకర్తలను ఎక్కడ కూడా ఇబ్బందుల గురిచేసిన పోలీస్ స్టేషన్ ముందు ధర్నా దిగుతామని ఆయన హెచ్చరించారు. పోలీసు అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల సమాజంలో మెలగాలని అన్నారు. మా కార్యకర్తల దగ్గరికి వస్తే ఊరికించి కొడతామన్నారు.
స్థానిక పోరుకు కార్యకర్తలు సన్నద్ధం కావాలి..
రాష్ట్రంలో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మంచిరెడ్డి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలు ఎక్కడా ఇబ్బందులకు గురి కావాలని ఆయన పిలుపునిచ్చారు.