Koppula Eshwar | “ గోదావరి నదిలో నీరులేక ఎడారిని తలపిస్తున్నది.. ఈ సీజన్లో రైతులకు సాగునీరందక పంటలు ఎండిపోయే ప్రమాదమున్నది.. గోదావరిలోకి సరిపడా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవలసిన అవసరం ఉంది”.. అంటూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాజీ మంత్రి ఈశ్వర్ ఫోన్లో మాట్లాడి సాగునీరందించాలని కోరారు. కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తికి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. త్వరలోనే జిల్లా కలెక్టర్, సంబందింత శాఖ అధికారులతో రివ్యూ నిర్వహించి రైతులకు సాగునీటిని తప్పక అందిస్తామని హామీ ఇచ్చారు.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం నాడు ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రిని కలిసిన రైతులు.. సాగునీరందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నదని తెలిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ఎస్సారెస్పీ ద్వారా నీరందింపజేసి సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు. దీంతో కొప్పుల ఈశ్వర్ స్పందించి ధర్మపురం మండలంలోని ధమ్మన్నపేట వద్ద ఎండిపోయిన గోదావరి నదిని రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఫోన్ చేసి సమస్యను వివరించారు.
అనంతరం కొప్పుల ఈశ్వర్ విలేకరులతో మాట్లాడుతూ.. నదిలో నీరులేక ఏడారిని తలపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి సీజన్ ప్రారంభమై వరి నాట్లు చివరి దశకు చేరుకున్న తరుణంలో గోదావరిలో నీరులేక వరి ఎండిపోయే ప్రమాదమున్నదని రైతులు విన్నవించిన సందర్భంగా గోదావరి నదిని పరిశీలించడం జరిగిందన్నారు. గతంలో నిండుకుండలా ఉన్న గోదావరి ప్రస్తుతం చుక్కనీరులేక ఏడారిని తలపిస్తున్నదని తెలిపారు. కమ్మునూర్, మంగేళ, బోర్నపల్లి నుండి ధర్మపురి వరకు గోదావరి నది ఆధారంగా 18 లిఫ్టులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఒక్కో లిఫ్టు కింద దాదాపు 2వేల నుంచి 3వేల ఎకరాల ఆయకట్టు సాగవుతున్నదనీ, ఇవి కాకుండా స్వతహాగా పంపుసెట్లు పెట్టుకున్న రైతులు వేల సంఖ్యలో ఉన్నారని తెలిపారు. ఇప్పటికే రైతులు నాట్లు వేసుకున్నారనీ, పొలాలకు నీటి తడి అందక.. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నీరు ఇస్తారో ఇవ్వరో తెలియక ఆందోళనలో రైతులు కొట్టుమిట్టాడుడున్నారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎస్సారెస్పీ ద్వారా గోదావరిలోకి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ హయాంలో యాసంగి సీజన్లో మత్తడి దూకిన చెరువులు
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులతో నిత్యం సమీక్ష నిర్వహించి గోదావరి నది, చెరువులు, కుంటలు, వాగులు, చెక్‌డ్యామ్‌లను నిండుకుండల్లా ఉంచి నాడు రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేశారని కొప్పుల ఈశ్వర్ గుర్తుచేశారు. యాసంగి సీజన్లో కూడా నాడు ఎన్నో చెరువులు మత్తళ్లు దూకిన సందర్భాలు అనేకం ఉన్నాయని తెలిపారు. ధర్మపురి ఎమ్మెల్యేగా 15 ఏళ్లు పనిచేసిన సందర్భంలో ఎప్పుడు అవసరం వచ్చినా కేటీఆర్, హరీశ్‌రావులతో మాట్లాడి ఎస్సారెస్పీ నుంచి నీటిని కావలసినంతగా విడుదల చేయించామని గుర్తుచేశారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నీటిని విడుదల చేయించాలని డిమాండ్ చేశారు.