Harish Rao | తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సిద్దిపేటలో దీక్ష చేయని మనిషే లేడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. ఉద్యమాల కోట దుబ్బాక, గజ్వేల్‌లోనూ దీక్ష చేశారని అన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన దీక్షా దివాస్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి హరీశ్‌రావు పాలాభిషేకం చేశారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో మన భాగస్వామ్యం.. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నంత గొప్పదని చెప్పారు.
రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఒక్క ఉద్యమ కేసైనా ఉన్నదా అని అడిగారు. తమ మీద వందల కేసులు నమోదు చేశారని తెలిపారు. ఇచ్చిన తెలంగాణ ప్రకటనను కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తీసుకున్నప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున మొదలైందని.. అప్పుడు ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేశారని గుర్తుచేశారు. అప్పుడు రాజీనామా చేయకుండా రేవంత్ రెడ్డి పారిపోయిండని విమర్శించారు. ఇప్పటి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా రాజీనామా చేయలేదని తెలిపారు.
రేవంత్ రెడ్డి మీద ఉద్యమ కేసులు లేవు కానీ.. ఓటుకు నోటు కేసు మాత్రం నమోదైందని హరీశ్‌రావు అన్నారు. అలాంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారా అని మండిపడ్డారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిపై మరకలు వెంటాడుతూనే ఉంటాయని అన్నారు.