నర్సాపూర్ : సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దెబ్బకు సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలంటేనే గడగడ వణుకుతున్నడని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నర్సపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గెలిచిన వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. రేవంత్‌రెడ్డిని ఏకిపారేశారు.
ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వారికి నా పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. ఈ గెలుపు మామూలు గెలుపు కాదు, అద్భుతమైన గెలుపు. ఓటమి భయంతో రేవంత్‌రెడ్డి కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఫలితం దక్కలేదు. సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ప్రచారం చేయరు. కానీ ఓడిపోతామనే భయంతో రేవంత్‌రెడ్డి ఊరూరు తిరిగిండు. ‘అందిరికీ బతుకమ్మ చీరలు ఇచ్చిన, ఆ చీరలు కట్టుకుని వచ్చి కాంగ్రెపోళ్లకు ఓటేయాలె’ చిల్లర మాటలు మాట్లాడిండు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ భంగపడింది. సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి 90 శాతం, వీలైతే 100 శాతం విజయాలు దక్కాలి. కానీ కాంగ్రెస్‌కు 64 శాతం ఫలితాలే వచ్చాయి. కాంగ్రెస్ 6 వేల సర్పంచ్ పదవులు గెలిస్తే, బీఆర్ఎస్ 4 వేల సర్పంచ్ పదవులు గెలుచుకుంది’ అన్నారు.
‘బీఆర్ఎస్ హయాంల 32 జిల్లాపరిషత్‌లు మనమే గెలిచినం. 10 డీసీసీబీలు, 10 డీసీఎంఎస్‌లు ఉంటే వంద శాతం మనమే గెలిచినం. సర్పంచ్ ఎన్నికల్లో 80 నుంచి 90 శాతం మనమే గెలిచినం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా 35 నుంచి 40 శాతం బీఆర్ఎస్ సర్పంచ్‌లను గెలిపించిండ్రు ప్రజలు. కాంగ్రెసోళ్లు పైసలు పంచి, సారా పంచి, గూండాగురి చేసినా గూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి 4 వేల మంది సర్పంచ్‌లుగా గెలువడం మామూలు విషయం కాదు. రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీ లేదు సచ్చిపోయింది అంటడు. కానీ నిద్రల గూడా బీఆర్ఎస్ పార్టీ గురించే కలువరిస్తడు. బీఆర్ఎస్ పార్టీ పేరు తీయకుండా, కేసీఆర్ పేరు తీయకుండా ఎప్పుడన్న మాట్లడుతడా రేవంత్‌రెడ్డి..? మల్ల మీదికెళ్లి మేకపోతు గాంభీర్యం. ఓసారి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇగ బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇక నుంచి ఆ పార్టీ విత్తనం కూడా మొలకెత్తనియ్యను అని శపథం చేసిండు. కానీ ఇప్పుడు రేవంత్‌రెడ్డి గుండెల నుంచి 4 వేల మంది బీఆర్ఎస్ సర్పంచులు మొలకెత్తిండ్రు’ అని వ్యాఖ్యానించారు.
‘నీకు దమ్ముంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టు. కారు గుర్తులేని సర్పంచ్ ఎన్నికలల్లనే 4 వేల మంది గెలిచిండ్రు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెడితే అండ్ల కారు గుర్తు ఉంటది. కారు గుర్తు అంటే కేసీఆర్ గుర్తు. జనం కారు గుర్తు మీద ఓట్లు గుద్దిగుద్ది సంపుతరు నిన్ను ఏమనుకుంటున్నవో. కారు గుర్తు ఉండే ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకుంది. ఎన్నికలంటేనే రేవంత్‌రెడ్డి గడగడ వణుకుతున్నడు’ అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.