తెలంగాణలో దారులన్నీ ఓరుగల్లుకే బాట చూపుతున్నాయి. మనం నమ్మిన ఏలిక సందేశం విందామని ఆరాటం. పాతికేండ్లుగా మన జీవితాల్లో భాగమైన బీఆర్ఎస్ పండుగ ఇది. పురిటి బిడ్డగా ఉన్నప్పుడే పోరాటం నేర్చిన పార్టీ.. వ్యూహాత్మక మౌనాలు.. అనూహ్యమైన ఎత్తుగడలు.. ప్రపంచ ఉద్యమాలకు ఉనికి ఇదే అన్నంత ఉన్నతంగా సాగిన పోరు ఇది. దానిని నడిపిన వాడు.. ఉద్యమ కేసరి.. కేసీఆర్. వెన్నుచూపని పోరుతో.. లక్ష్యాన్ని అందుకున్నవాడు కేసీఆర్. తెలంగాణ సాధించి, సాకారమైన రాష్ర్టాన్ని సకల రంగాల్లో అగ్రభాగాన నిలబెట్టి.. కార్యసాధకుడు అనిపించుకున్న మన కేసీఆర్.. పర్జన్యంలా గర్జించనున్నాడు. ఆయన విజన్ కాలాతీతం.. ఇజం ఊహాతీతం… అందుకే తెలంగాణలోని పల్లె, పట్నం ఎల్కతుర్తి బాటపడుతున్నది. ఓరుగల్లు పోదమా.. పోరుబిడ్డను సూద్దమా.. అని కదం తొక్కుతున్నది.
భయవిహ్వలులు అవరోధాలు ఎదురైతే అస్త్ర సన్యాసం చేస్తారు. కానీ, కార్యసాధకులు ఆటంకాలనే సోపానాలుగా మలుచుకుంటారు. సముద్ర లంఘనం చేసినప్పుడు అంజన్నకు అడుగడుగునా విఘాతాలే ఎదురయ్యాయి. మైనాకుడు ఆతిథ్యం స్వీకరించమన్నాడు. కుదరదన్నాడు హనుమ. సురస పరీక్షకు నిలబెట్టింది, తెలివిగా నెగ్గాడు. సింహిక శక్తినంతా లాగేసుకునే ప్రయత్నం చేసింది. లాగి ఒక్కటిచ్చుకొని ముందుకుసాగాడు. లంకిణి అడ్డగించింది. దయ తలచి వామహస్తంతో ముష్టిఘాతమిచ్చి విమోచనం ప్రసాదించాడు. అన్ని అవరోధాలూ దాటుకొని సీతమ్మను దర్శించి, లంకను కాల్చి కార్యదక్షుడు అనిపించుకున్నాడు. అక్కడ హనుమయ్య ఆయుధం రామనామం. ఎత్తుగడ సాహసం.
తెలంగాణ సాధించిన కార్యసాధకుడు కేసీఆర్. ఆయన ఆయుధం ఉద్యమం. ఎత్తుగడ రాజకీయం.బీఆర్ఎస్ పుట్టుకతోనే మలిదశ ఉద్యమం పురుడు పోసుకుంది.జలదృశ్యం సాక్షిగా కురిసిన అగ్నిపూల వర్షం… దావానలమైంది.పసివాడు కసిగా ‘జై తెలంగాణ’ అన్నాడు. నడుం వంగిన ముదుసలి వణుకుతున్న చేతులతోనే పిడికిలి బిగించాడు.
రైతులు తెలంగాణ కావాలన్నారు. విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం రావాల్సిందే అన్నారు. ఉద్యోగులు ఉద్యమించారు. ఆటోవాలాలు, రిక్షా కార్మికులు, న్యాయవాదులు, ఇంజినీర్లు అన్ని వర్గాల వారూ తెలంగానం అందుకున్నారు.1969 తర్వాత మళ్లీ ఏనాడూ పెగలని నినాదం.. 2001 తర్వాత మళ్లీ ఎందుకు మన విధానమైంది?
రెండున్నర పుష్కరాలు నివురు లేదు, నిప్పు లేదు. తెలంగాణ అడ్డాగా సమైక్యవాదులు ఆడిందే ఆట, పాడిందే పాట. అడిగినోడు లేడు. ‘అయ్యో’ అని ఆరాటపడ్డవాడూ లేడు. ముందుండి నడిపించే నాయకుడు కరువై.. సైద్ధాంతికంగా కూడా తెలంగాణవాదం పలుచనైంది. సినిమాల్లో చులకనైంది.
కేసీఆర్ రాకతో.. కాక మొదలైంది.ఆయన బక్క పిడికిలి ఇందరినీ ఒక్కటి చేసింది.తెలంగాణకు ఎట్ల ద్రోహం చేశారో కేసీఆర్ చెబుతుంటే, మనసున్న సమైక్యవాదులు కూడా ‘అయ్యో… ఇంత అన్యాయమా!’ అనుకున్నారు.
పదమూడేండ్ల పోరు.. కాలంతో పోటీగా పరుగులు తీసింది.పార్టీ పెట్టిన మూణ్నాళ్లకే.. స్థానిక సంస్థల ఎన్నికలు. అక్కడ తేలిపోతే.. తెలంగాణవాదం హుళక్కే! అక్కడ ఓడినా.. గెలిచినా.. సుదీర్ఘ సమరం చేస్తే గానీ, తెలంగాణ బిడ్డల కల సాకారం కాదని కేసీఆర్‌కు తెలుసు.
లోకల్‌బాడీ ఎన్నికల ఫలితాల్లో విజయం… గులాబీ దండులో ఉత్సాహం… ప్రత్యర్థి వర్గాల్లో నైరాశ్యం…
పల్లె పల్లెకూ తెలంగాణవాదాన్ని ఉప్పెనలా తీసుకుపోవడానికి స్థానిక సమరాన్ని వారధిగా మలుచుకున్నాడు ఉద్యమనేత. అప్పటినుంచి..
తెలంగాణ పోరులో ఎన్నికలు అంతర్భాగమయ్యాయి. పట్టు బిగించాల్సిన తరుణం వచ్చినప్పుడల్లా ఉప సమరానికి సై అనడం, ప్రత్యర్థుల తొడలు విరిచి మెడలు వంచడం కేసీఆర్ ఎత్తుగడలో భాగం.
అంతిమ ఘడియలు ఆసన్నమయ్యాయి. పొత్తులు నిర్వీర్యమయ్యాయి. పెద్ద ఎత్తు వేయాల్సిన సందర్భం వచ్చింది. ఉద్యమకారుల్ని ఉసిగొలిపితే.. సమైక్యవాదుల చిరునామాలు గల్లంతయ్యేవే! కానీ, ముందుగా చెప్పినట్టు కార్యసాధకులు మాట తప్పరు. మడమ తిప్పరు. పోరుబాటలో రక్తపాతానికి తావులేదన్న నిర్ణయానికే కట్టుబడ్డాడు కేసీఆర్. తన ప్రాణాలను పణంగా పెట్టి.. తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం చేశాడు. తర్వాత జరిగిన పరిణామాలు, కేసీఆర్ చతురత.. ఢిల్లీ పెద్దల నుంచి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకునేలా చేశాయి.
తెలంగాణ వచ్చింది.. బీఆర్ఎస్ ఎందుకు? అందరిలోనూ ఇదే ప్రశ్న! దానికి కేసీఆర్ ఇచ్చిన బదులు.. ‘నిన్నటి వరకు ఉద్యమ పార్టీ.. ఇకపై ఇది తెలంగాణ పార్టీ… రాజకీయ పార్టీ’ అని. తెలంగాణ ప్రజ కూడా.. రాష్ర్టాన్ని సాధించిన బీఆర్ఎస్కే పట్టం కట్టింది. ఉద్యమ నేత… మనసున్న నేత.. విజనున్న నాయకుడు.. నికార్సయిన ప్రజాప్రతినిధి… తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. ఇంత సాధించినా.. కుట్రలు ఆగలే! అడ్డగింపులకు అడ్డుకట్టపడలే!
అన్నిటినీ ఛేదించి.. తెలంగాణ జోలికొస్తే.. జాలి చూపించేది లేదని హెచ్చరికలు జారీ చేశాడు కేసీఆర్. 58 ఏండ్ల దురాక్రమణతో కునారిల్లిన రాష్ర్టాన్ని అంచెలంచెలుగా పునర్నిర్మించాడు. సాధించిన రాష్ర్టాన్ని.. తీర్చిదిద్దిన తీరు చూసి.. తల్లి తెలంగాణ పరవశించిపోయింది. పల్లె నుంచి పట్నం దాకా పొంగిపోయింది. పదేండ్ల పాలనలో.. వందేండ్ల ప్రగతికి నిలువుటద్దంగా తెలంగాణను ఆవిష్కరించాడు కేసీఆర్.
ఉమ్మడి రాష్ట్రంలో గొంతెండిన గోదారికి స్వరాష్ట్రం వచ్చాక దాహం తీరింది.జీవం కోల్పోయిన చెరువులు.. జలకళ సంతరించుకున్నాయి. అన్నదాతలకు చేతుల నిండా పని.. గాదెల నిండా ధాన్యం.. సడుగులు ఇరిగిన మగ్గం.. పట్టపగ్గాల్లేకుండా ఆడింది. పొక్కిళ్ల వాకిళ్లలో ఆడబిడ్డల నవ్వులు విరిశాయి. మొత్తంగా తెలంగాణ తెల్లవడ్డది. అన్నింటా మిన్నగా నిలవడ్డది.
పచ్చగ ఉన్న తెలంగాణకు దిష్టి తగిలిందేమో! కాంగ్రెస్ గెలిచింది. తెలంగాణ ఓడింది. ఏడాదిన్నరలో పదేండ్ల పరిశ్రమ పలాయనం చిత్తగించింది. పాలన గాడితప్పింది. సంక్షేమం మాట తప్పయింది. మళ్లీ మన తెలంగాణకు మునుపటి దుర్దినాలు మొదలయ్యాయి. ఈ దుర్దశను తప్పించే ఒకే ఒక్కడు కేసీఆరే. తెలంగాణను మళ్లీ నిలబెట్టేది బీఆర్ఎస్సే. అందుకే పిల్లాజెల్లా.. పెద్దాయన మాట కోసం ఓరుగల్లుకు బయల్దేరారు. తల్లీబిడ్డా ఉద్యమ నేత పిలుపు కోసం కదులుతున్నారు.
పంట పెట్టుబడి కోల్పోయిన రైతులు..
పెన్షన్ అందుకోని అవ్వలు..
తులం బంగారం ఆశలు గల్లంతైన కల్యాణలక్ష్ములు..
పీఆర్సీ కోసం విసిగిపోయిన ఉద్యోగులు..
అన్ని రంగాల్లోని బాధితులు..
కేసీఆర్ పిలుపు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.
మన గులాబీ పార్టీ.. రజతోత్సవ ఉత్సాహం… తెలంగాణకు స్వర్ణోత్సవ వేడుకకు దారి చూపుతుందన్న విశ్వాసం వారిది.2001లో తెలంగాణ సాధించి తీరుతానని సంకల్పించాడు కేసీఆర్. అలుపెరుగని పోరాటంతో దానిని సాకారం చేశాడు.ఈ రజతోత్సవ వేళ.. తాను తీర్చిదిద్దిన తెలంగాణ ఆగమైపోతున్న వేళ, ఉద్యమ నేతగా మరో ఉక్కు సంకల్పానికి కేసీఆర్ నాంది పలకడం ఖాయం. అది నెరవేరడమూ అక్షర సత్యం. జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
కరీంనగర్ ఉప ఎన్నిక వెయ్యి అలజడుల పెట్టు. అంత ప్రభావం చూపుతుంది. ఇది మనకు అంతిమ యుద్ధం. చావో రేవో తేల్చుకుందాం. నేను మిమ్మల్ని జైలుకు పొమ్మంట లేను. లాఠీ దెబ్బలు తినమంట లేను. వ్యవసాయం, ఉద్యోగం, వ్యాపారాలు పాడుచేసుకోమని చెప్తలేను. చేయాల్సిందల్లా.. మనం ఒక రాజకీయ శక్తిగా ఎదగాలి. అందుకు మీరందరూ కదం తొక్కాలి.
అహింసామార్గంలో స్వాతంత్య్రాన్ని సాధించి గాంధీ మహాత్ముడు కొత్త పోరాట పంథాను పరిచయం చేశారు. ఆ మార్గంలోనే శాంతియుతంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. ఉద్యమాన్ని ప్రారంభించే సమయంలో గాంధీ పోరాట వ్యూహరచనను పుణికిపుచ్చుకున్నాం. నా సహచరులు చాలా సందర్భాల్లో నిరాశకు లోనైనా నేను ఆ పంథా వీడలేదు.
ప్రాణం పోయినా బిగించిన పిడికిలి విడువను. ఎత్తిన జెండా దించను. కచ్చితంగా రాష్ట్రం సాధిస్తా. ఒకవేళ నేను పెడమార్గం పడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి. నేను దృఢమైన సంకల్పంతోని, కచ్చితంగా సాధించాలనే సదుద్దేశంతోని ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నా. ఇంటికి ఒక్క యువకుడిని నాకు అప్పచెప్పండి. వందశాతం తెలంగాణ రాష్ట్రం సాధిస్తా.
2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తూ టీఆర్ఎస్ ఆవిర్భావ సమావేశంలో కేసీఆర్
ప్రజల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేస్తుంది. తెలంగాణ కోసం ఎన్నో ఆత్మ బలిదానాలు జరిగాయి. నేను చావు అంచువరకు వెళ్లి మీ అందరి దయ వల్ల బతికి బయటపడ్డా! రాష్ర్టాన్ని సాధించుకున్నం. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి బంగారు తెలంగాణ తయారుచేసి ప్రజల చేతుల్లో పెడతా.
కేసీఆర్ ప్రసంగం ఓ సజీవ జలధార. ఆయన మాటల్లో నవరసాలు ఒలుకుతాయి. సందర్భోచితంగా, రసస్ఫోరకంగా మాట్లాడగలరు. ఆయన ఉపన్యాసంలో రౌద్రం ఉంటుంది. వీరత్వం ఉంటుంది. ఆర్తి వినిపిస్తుంది. కరుణ కనిపిస్తుంది. హాస్యం తొణికిసలాడుతుంది. వ్యంగ్యం తొంగిచూస్తుంది. శబ్ద నిఘంటువు పొంగిపోయేలా పదప్రయోగాలు చేస్తుంటారు. ప్రసంగించే వేదికకు తగ్గట్టుగా ఆయన ప్రయోగాలు పల్లవిస్తుంటాయి. సాహితీ సభలో పద్యాలు వినిపిస్తూ పసందైన ప్రసంగం చేస్తారు. ఛలోక్తులు విసురుతూ సభను రంజింపజేస్తారు. వేదిక ఏదైనా సభికులను కట్టిపడేయడం ఆయన తనకు తానుగా నేర్చుకున్న విద్య.
సాహితీవేత్తల సాంగత్యం, పుస్తక పఠనం, విషయ అవగాహన, భాషా పరిజ్ఞానం ఇవన్నీ కేసీఆర్‌ను అత్యుత్తమ వక్తగా తీర్చిదిద్దాయి. సంక్లిష్టమైన విషయాన్ని కూడా అత్యంత సరళంగా చెప్పడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఉద్యమ సమయంలో కేసీఆర్ మాట్లాడుతుంటే జనం ఊగిపోతూ విన్నారు. ఒగ్గుకథ వింటున్నట్టుగా విన్నారు. జలసాధన క్యాసెట్లో ఉన్న కేసీఆర్ మాటలను ఊరూరా చౌరస్తాల్లో బుంగీలు పెట్టుకొని వినేవాళ్లు. అంతగా ప్రభావితం చేశారు. విషయంతోపాటు సభను కూడా ఓన్ చేసుకుని ఆయన మాట్లాడే శైలికి అందరూ అభిమానులే! కేసీఆర్ మాటల్లో ఆర్ద్రత, సృజన అంతర్వాహినుల్లా ప్రవహిస్తూ ఉంటాయి.
ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌ను కలుస్తున్న మేధావులు పదేపదే చెప్పే మాట- ‘హి ఈజ్ ఏ గుడ్ లెర్నర్’. ఆయన పుస్తకాలు మాత్రమే చదవరు. సమాజాన్ని చదువుతారు. మనుషులను చదువుతారు. సమస్యలను చదువుతారు. సమస్యల మూలాలను చదువుతారు. పరిష్కారాలు సాధిస్తారు. అందుకే కేసీఆర్ నిరంతర అధ్యయనశీలి. పల్లెటూరికి పోతే అక్కడి పరిస్థితులను ఆయన అధ్యయనం చేస్తారు. ఒక పేదవాడు కనిపిస్తే, అతడి కష్టసుఖాలను, జీవన పరిస్థితులను తెలుసుకుంటారు. కాలంతో మారుతున్న పరిస్థితులను వేగంగా గ్రహిస్తారు. అతివేగంగా ఆకళింపు చేసుకోవడం ఆయనకున్న అరుదైన శక్తి. ఆయన పథకాలన్నీ ఉద్యమ కాలపు అనుభవాల ఫలితమే. కల్యాణలక్ష్మి మొదలుకొని ప్రతి పథకం వెనుక ఆయన అధ్యయనం నిక్షిప్తమై ఉంటుంది. ఆయన ప్రవేశ పెట్టిన దళిత బంధు, రైతుబంధు వంటి ప్రతి పథకమూ తరచి చూస్తే అంతర్జాతీయ అధ్యయనాలు, సూచనల ప్రకారం శాస్త్రీయమైనదిగా తేలుతుంది. అందుకే బీఆర్ఎస్ పథకాలకు ఇంతటి ప్రశంసలు, ఆసక్తి వ్యక్తమయ్యాయి. ఆచరణలో సత్ఫలితాలను ఇస్తున్నాయి.
ఒక మహా నాయకుడు మాత్రమే మరింతమంది నాయకులను సృష్టించగలడు. పాతికేండ్ల క్రితం కేసీఆర్ ‘జై తెలంగాణ’ నినాదానికి ‘జై..జై.. తెలంగాణ’ అంటూ ఉద్యమ పిడికిలి బిగించినవాళ్లలో పెద్దపెద్ద నాయకులెవరూ లేరు. అంతా అతి సామాన్యులే. యూనివర్సిటీ విద్యార్థులు, చిన్నచిన్న వ్యాపారులు, నిరుద్యోగులు, గృహిణులు, సన్నకారు రైతులే. ఎవరికీ ఉద్యమాలంటే తెలియదు, వ్యూహ ప్రతివ్యూహాల మీద పట్టులేదు. లీడర్‌ను చూసి నేర్చుకున్నదే ఎక్కువ. నాయకుడి ప్రతి అడుగూ ఓ ఉద్యమ పాఠమే. బలమైన అయస్కాంత క్షేత్ర పరిధిలో ఉన్న ఇనుప ముక్కకు కూడా ఆకర్షణ శక్తి వస్తుంది.
కేసీఆర్ నేతృత్వంలోని మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ అదే జరిగింది. కేసీఆర్ సైన్యమై పోరాటాలు చేసినవారంతా రాష్ట్ర అవతరణ సమయానికి నాయకులుగా రాటుదేలారు. ‘యో యాస్మిన్ కర్మణి కుశలః తం తస్మినేవ నియోజయేత్..’ సమర్థ నాయకుడు తన అనుచరుల్లో ఎవరు ఏ పనిలో నిపుణులో, వారికి ఆ బాధ్యతలు అప్పగిస్తాడని చెబుతుంది అర్థశాస్త్రం! కేసీఆర్ చేసిందీ అదే. క్యాబినెట్ మంత్రుల నుంచి సర్పంచుల వరకూ రకరకాల బాధ్యతలు అప్పగించారు. ఒక మేనేజ్మెంట్ స్కూల్ మహా అయితే ఏడాదికి ఓ వందమంది లీడర్లను తయారు చేయగలదు. కానీ, కేసీఆర్.. గల్లీ గల్లీకో నేతను సృష్టించారు.
– త్రిగుళ్ల నాగరాజు