హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో కాంగ్రెస్‌కు షాక్ తగలనున్నదా?? అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావొస్తున్నా.. కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైలేజీ కోసం మైనార్టీ నేతకు మంత్రి వర్గంలో చోటు కల్పించిన కాంగ్రెస్ స్ట్రాటజీ బూమరాంగ్ కానున్నదా? ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైన హస్తం పార్టీకి జూబ్లీహిల్స్ ఓటర్లు దిమ్మతిరిగే షాక్ ఇవ్వనున్నారా? హైడ్రా పేరిట పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపి విధ్వంసం సృష్టిస్తున్న రేవంత్ సర్కారుకు జూబ్లీహిల్స్ ఓటర్లు కర్రుకాల్చి వాత పెట్టనున్నారా? కేసీఆర్ పదేండ్ల పాలనలో హైదరాబాద్ నలువైపులా అభివృద్ధి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన సేవలను మరవని ఓటర్లు బీఆర్ఎస్కే మరోసారి పట్టం కట్టనున్నారా? అంటే ఎన్నికల సర్వేలో విశ్వసనీయతకు మారు పేరుగా చెప్పుకొనే ‘చాణక్య స్ట్రాటజీస్’ మంగళవారం విడుదల చేసిన ప్రీ-పోల్ సర్వే గణాంకాలను విశ్లేషిస్తే ‘అవును’ అని స్పష్టమవుతున్నది.
చాణక్య స్ట్రాటజీస్ సర్వే సంస్థ తాజాగా విడుదల చేసిన ప్రీ-పోల్ సర్వేలో బీఆర్ఎస్కు 43 శాతం మంది జూబ్లీహిల్స్ ఓటర్లు మద్దతు ప్రకటించినట్టు తేలింది. కాంగ్రెస్‌కు 38 శాతం, బీజేపీకి 10 శాతం మంది ఓట్లు పడుతాయని సర్వే సంస్థ తేల్చింది. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కు 5 శాతం ఎక్కువ ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. ఇక, సర్వేలో పాల్గొన్న 9 శాతం మంది స్వింగ్ ఓటర్లుగా పేర్కొన్న సంస్థ.. ఈ స్వింగ్ ఓటర్లలో అత్యధిక మంది బీఆర్ఎస్కే మద్దతు ప్రకటించే అవకాశం ఉన్నట్టు అభిప్రాయపడింది. స్వింగ్ ఓటర్లు ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఓటేసే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణంగా వివరించింది. ఈ లెక్కన బీఆర్ఎస్కు మరో 4 శాతం ఓట్లు అదనంగా వచ్చే అవకాశం ఉన్నట్టు సర్వే సంస్థ అంచనా వేసింది. ఇది కూడా కలిపితే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కు 5 శాతం నుంచి 8-9 శాతం వరకు ఎక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిపింది. మొత్తంగా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని సంస్థ కుండబద్దలు కొట్టింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆరు అంశాలు కీలకంగా మారినట్టు ‘చాణక్య స్ట్రాటజీస్’ ప్రీ పోల్ సర్వే వెల్లడించింది. కుల సమీకరణాలు, ఓటర్ల వయసు, కాంగ్రెస్ రెండేండ్ల పాలన తీరు, ఎన్నికల్లో బీజేపీ ప్రభావం, పార్టీల ఎన్నికల ప్రచారంతో పాటు ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఏం కోరుకుంటున్నారనే అంశాలు కీలకంగా మారినట్టు తెలిపింది. ఈ ఆరు ప్రధాన అంశాల్లో మెజారిటీ ఓటర్లు బీఆర్ఎస్కే మద్దతు ప్రకటించినట్టు సర్వే సంస్థ వివరించింది.
కాంగ్రెస్‌పై బీసీల్లో వ్యతిరేకత ఉన్నట్టు సర్వే తేల్చింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్.. తమకు కనీస గుర్తింపు ఇవ్వడం లేదని బీసీ కులాలు ఆగ్రహంతో ఉన్నట్టు తెలిపింది. అందుకే కాంగ్రెస్ ప్రచారానికి వారంతా దూరంగా ఉన్నట్టు పేర్కొన్నది. ఇక్కడ సెటిలర్స్ ఓట్లు కీలకంగా కాగా.. 70% మంది బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నట్టు తెలిపింది. హైడ్రా కారణంగా భూముల కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడం కాంగ్రెస్‌పై వ్యతిరేకతకు ప్రధాన కారణం అని వివరించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కొత్త ఓటర్లు కీలకం కానున్నారని, 12 వేల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్టు తెలిపింది. 30 ఏండ్లు దాటిన మహిళల్లో 70 శాతం మంది మాగంటి సునీత వైపు ఉన్నారని వెల్లడించింది. ఇందుకు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తమకు మంచి చేశారనే అభిమానం, మాగంటి సునీతపై సానుభూతి ప్రధాన కారణం అని వివరించింది.
ఆరు గ్యారెంటీల ఆశ చూపెట్టిన కాంగ్రెస్, తెలంగాణలో అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావొస్తున్నది. కానీ ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఉచిత బస్సు పథకంతో ఆటోవాలాల ఉపాధి పోయి వారంతా రోడ్డున పడ్డారు. జూబ్లీహిల్స్‌లో అనేక మంది ఆటోలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వాళ్లంతా తమ ఉపాధి పోయిందనే ఆగ్రహంతో ఉన్నారని సర్వే తెలిపింది. హైడ్రాతో తమకు నిలువ నీడ లేకుండా చేశారనేది మాస్ ఓటర్ల మాట. సిటీలో పెద్ద ఎత్తున వలస కూలీలు ఉన్న నియోజకవర్గాల్లో జూబ్లీహిల్స్ ఒకటి కాగా.. కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో తమకు ఉపాధి పోయిందని వారంతా ప్రభుత్వంపై కోపంతో ఉన్నట్టు సర్వే వెల్లడించింది.
కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారం కూడా ఓటర్లపై అంతగా ప్రభావం చూపించడంలేదని సర్వే సంస్థ అభిప్రాయపడింది. బీఆర్ఎస్ ర్యాలీలు, సమావేశాలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తుండగా కాంగ్రెస్ సభలకు ప్రజలు దూరంగా ఉంటున్నట్టు సర్వే సంస్థ తెలిపింది. తాజాగా నియోజకవర్గంలో జరిగిన సీఎం రోడ్డు షోలో పాల్గొన్న వారిలో చాలామంది డబ్బులు తీసుకొని వచ్చిన వాళ్లేనని సర్వే సంస్థ కుండబద్దలు కొట్టింది. రేవంత్ హామీలను ప్రజలు నమ్మడంలేదని తేల్చి చెప్పింది. జూబ్లీహిల్స్‌లో బీజేపీ ప్రభావం ఎక్కువగా లేదని తెలిపింది. కింది స్థాయిలో క్యాడర్ బలహీనంగా ఉండటం, సీనియర్ల మధ్య విభేదాలు కమలదళానికి ప్రతికూలంగా మారినట్టు పేర్కొన్నది. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితి ఉన్నట్టు సర్వే పేర్కొంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ అందరికంటే ముందంజలో ఉన్నదని సర్వే తెలిపింది. అభ్యర్థుల ప్రకటనకు ముందే బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లిపోయిందని, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియక నేతలంతా సైలెంట్‌గా ఉండిపోయినట్టు తెలిపింది. మాగంటి సునీత పేరు మొదట్లోనే ఖరారు కావడంతో గులాబీ శ్రేణులు ఓటర్లకు చేరువైనట్టు పేర్కొన్నది. బీఆర్ఎస్ తరఫున మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి సహా ముఖ్య నేతలంతా ప్రచారం చేసినట్టు తెలిపింది. బీఆర్ఎస్ ర్యాలీలు, సమావేశాలకు పెద్ద ఎత్తున ప్రజలు రాగా, కాంగ్రెస్‌కు మాత్రం ఆశించిన మేర జనం రాలేదని స్పష్టంచేసింది. సోషల్‌మీడియా ప్రచారంలోనూ బీఆర్ఎస్ దూకుడుగా ఉండగా, కాంగ్రెస్ వెనుకబడినట్టు సర్వే అభిప్రాయపడింది.
ఆరు గ్యారెంటీల అమలు హామీతోనే రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చామని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. అయితే గ్యారెంటీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్టు సర్వే తేల్చింది. ఇచ్చిన హామీలు మరచిన కాంగ్రెస్‌ను ఓడిస్తేనే హామీలు అమలు చేస్తారనే భావనలో ప్రజలు ఉన్నారని పేర్కొన్నది. ఇదే అంశాన్ని బీఆర్ఎస్ సైతం ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నది. కాంగ్రెస్‌ను ఓడిస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్తున్నది. తద్వారా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలతో రాష్ట్రంలో అసలైన మార్పునకు నాంది పలికినట్టవుతుందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రచారాన్ని ప్రజలు కూడా విశ్వసిస్తున్నట్టు సర్వే సంస్థ అభిప్రాయపడింది.
రేవంత్ ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయం ఎలా ఉన్నదో తెలుసుకోడానికి ‘చాణక్య’ సర్వే సంస్థ ఓ పబ్లిక్ ఒపీనియన్ క్వశ్చన్‌ను ప్రజల ముందు ఉంచింది. రెండేండ్ల కాంగ్రెస్ పాలన ఎలా ఉన్నది? అంటూ ప్రశ్నించింది. దీనికి ఏకంగా 63 శాతం మంది ఓటర్లు బాగోలేదు అంటూ సమాధానమిచ్చారు. 8 శాతం మంది చెప్పలేం అని పేర్కొనగా, 29 శాతం మంది బాగుందని తెలిపారు. ఈ లెక్కన రేవంత్ అవినీతిమయ బుల్డోజర్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తేటతెల్లమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
