తుర్కపల్లి, నవంబర్ 4: ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నా నిధులు మంజూరు కాలేదని, అధికారుల చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో నిధులు మంజూరు కాక అప్పు తెచ్చిన డబ్బులు తిరిగి ఎలా చెల్లించాలో తెలియక లబ్ధిదారుడు కోకుట్ల మల్లే శం తాసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మం డలం గంధమల్లలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కూకుట్ల మల్లేశం(మల్లయ్య) కూలి పని చేస్తూ జీవిస్తున్నాడు. అతడికి ఇద్దరు కూతుర్లు.
కాగా గ్రామంలో ఉన్న పెంకుటిల్లు శిథిలం కావడంతో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా రు. అధికారులు గ్రామాన్ని సందర్శించి 1472025న ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చారు. దీంతో మల్లయ్య తన పాత ఇంటిని కూల్చి కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇంటి బేస్మెం ట్ పూర్తయిన అనంతరం స్థానిక అధికారు లు ఫొటో తీసి, బిల్లు వస్తుందని నిర్మాణ పనులు కొనసాగించుకోమని చెప్పడంతో స్లాబ్ లెవెల్ వరకు నిర్మాణం పూర్తి చేశారు. అయినప్పటికీ బిల్లు రాలేదు.
అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోకపోగా లిస్టు లో పేరు తప్పు పడిందని, బిల్లు రాదని ఒకసారి బిల్లు రావాలంటే నిర్మాణం బేస్మెంట్ వరకే ఉండాలని, కట్టిన గోడలు తీసివేయాలని, పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. అధికారుల చుట్టూ తిరిగి వేసారి, తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక ఉన్న పాత ఇంటిని కూల్చి పిల్లలతో వేరే వాళ్ల ఇండ్లలో ఆశ్రయం పొందుతున్న మల్లయ్య మనస్థాపంతో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అది గమనించిన చుట్టుపక్కల వారు అడ్డుకొని మల్లయ్యను పోలీసులకు అప్పగించారు. అధికారులు ఇంటి నిర్మాణానికి మంజూరు పత్రం ఇచ్చిన తర్వాతే నిర్మాణం మొదలు పెట్టానని, ఇంటి నిర్మాణానికి ఇప్పటికే లక్షల్లో బాకీ చేశానని, అధికారులు బిల్లులు మంజూరు చేయకపోతే తనకు మరణమే శరణ్యమని ఆయన విలపించాడు.
త్వరలోనే బిల్లు మంజూరు..
సాంకేతిక కారణాల వల్ల మల్లయ్య ఇంటి బిల్లు మంజూరులో కొంత జాప్యం జరిగింది. త్వరలోనే బిల్లు మంజూరవుతుంది. గ్రామంలో మొత్తం 37 ఇండ్లు మంజూరు కాగా 35 మంది ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించారు. 33 మందికి బిల్లులు వచ్చాయి. మల్లయ్యతో పాటు మరొకరికి బిల్లుల మంజూరులో కొంత జాప్యం జరిగింది. త్వరలో వారికి బిల్లులు మంజూరవుతాయి.
– నవీన్, పంచాయతీ కార్యదర్శి