Methuku Anand | జర్నలిస్టుల అరెస్టుపై వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు మెతుకు ఆనంద్ మండిపడ్డారు. జర్నలిస్టులను అరెస్టు చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మెతుకు ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రి, మహిళా ఐఏఎస్ అధికారిపై ఓ వార్త చానల్లో వచ్చిన కథనం నేపథ్యంలో చానళ్లు, డిజిటల్ మీడియా హ్యాండిళ్లపై దర్యాప్తు కోసం రేవంత్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంపై విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంలో సీరియల్స్‌లో మాదిరి 8 మంది పోలీసులతో సిట్ ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు.
ఎప్పుడో రేవంత్ రెడ్డిపై పోస్టు పెట్టిన కావలి వెంకటేశ్పైనా సిట్ వేశారని మెతుకు ఆనంద్ తెలిపారు. కొడంగల్ మద్దూరుకు చెందిన వ్యక్తిని కూడా సిట్‌లో ఇరికించారని పేర్కొన్నారు. అసలు సిట్ అనే దానికి ఏమైనా విలువ ఉందా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రేవంత్ భాషలో సిట్ అంటే కూర్చోవాలి.. స్టాండ్ అంటే నిలబడాలేమో అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ అనుచరులు మా వాళ్లను బెదిరించారని తెలిపారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ అవాస్తవాలు ప్రచారం చేస్తే సిట్ వేశారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కూడా అర్ధరాత్రి బుల్లెట్ మీద పోతున్నాడని మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై సిట్ వేయరా అని ప్రశ్నించారు. ఆ రోజు ప్రెస్మీట్లో కోమటిరెడ్డికి ఏడుపొక్కటే తక్కువైందని అన్నారు. ఇంత విషమిచ్చి చంపండని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని గుర్తుచేశారు. మరి ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న వారిపై సిట్ వేయరా అని నిలదీశారు.
పండుగ వేళ రేవంత్ రెడ్డి జర్నలిస్టులను అరెస్ట్ చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు
మంత్రుల ఫోన్లు ట్యాప్ చేసి, మంత్రులపై మీడియాకు లీకులు ఇచ్చి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి చూశాడు
ఆ కథ అడ్డం తిరిగింది.. దీంతో కొంతమందిని బలిపశువులను చేయాలని జర్నలిస్టులను అరెస్ట్… https://t.co/CA6kYBwIEc pic.twitter.com/U8wyqnjdsI
— Telugu Scribe (@TeluguScribe) January 14, 2026
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటి ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేశారని మెతుకు ఆనంద్ గుర్తుచేశారు. బిల్లులు చెల్లించేందుకు కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా కమీషన్లపై ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. దానిపై కదా సిట్ వేయాల్సింది అని అన్నారు. తుపాకీ పెట్టి బెదిరించి రూ.300 కోట్లు అడిగారని మంత్రి కొండా సురేఖ కూతురు చెప్పారు.. దానిపై కదా సిట్ వేయాల్సిందని అన్నారు. ములుగు జిల్లాలో మంత్రి ఇసుక దందా చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిందని తెలిపారు. దానిపై రేవంత్ రెడ్డి ఎందుకు సిట్ వేయలేదని ప్రశ్నించారు. వికారాబాద్‌లో ఎవరిని కదిలించినా కమీషన్లే అని విమర్శించారు. పోలీసుల దగ్గర మామూళ్లు, ట్రాన్స్ఫర్లకు కమీషన్లు అడుగుతున్నారని తెలిపారు. మోమిన్‌పేటలో రెండేళ్లలో ముగ్గురు సీఐలు మారారని తెలిపారు.