Madhusudhana Chary | పరిపాలకుడు విజ్ఞుడై ఉండాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. విజ్ఞుడై ఉంటే సృజనాత్మకత సాధ్యమైతని తెలిపారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలంటే నీ జేజమ్మ వల్ల కూడా కాదని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేసే సోయి కాంగ్రెస్కు లేదని మధుసూదనాచారి విమర్శించారు. జిల్లాలను ఆగం చేస్తే తీవ్రమైన ప్రతిఘటన ఉంటుందని హెచ్చరించారు. రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. రెండేళ్లయినా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని అన్నారు. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాట ఇచ్చేటప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కనబడతారని.. మాట నిలబెట్టుకోవాలని అడిగితే పోలీసులు ప్రత్యక్షమవుతారని అన్నారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వానిది దుర్మార్గమైన వైఖరిని అని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పొగుడుతున్నారని మధుసూదనాచారి తెలిపారు. తుమ్మల రాజకీయ జీవితం ఎంత ఉన్నదో.. రేవంత్ రెడ్డి జీవిత కాలం దాదాపు అంతే ఉంటుందని అన్నారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి జపం చేయడంలో మంత్రులు తడిసిముద్దవుతున్నారని విమర్శించారు. బేసిన్లు తెల్వని ముఖ్యమంత్రిని బేసిన్లు తెలిసిన మంత్రి పొగుడుతున్నారని తెలిపారు. మంత్రులు వాళ్ల స్థాయిని తగ్గించుకుంటున్నారని అనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. మంత్రులు సీఎం భజనకు అంకితమై పనిచేస్తున్నారని విమర్శించారు.
రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మధుసూదనాచారి విమర్శించారు. చేస్తామన్న మంచి పనులు ఒక్కటి చేసిన దాఖలాలు లేవని అన్నారు. చెప్పకుండా చేస్తున్న దుర్మార్గాలు మాత్రం ఎన్నో ఉన్నాయని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక బీఆర్ఎస్ అని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు.