రామవరం, జనవరి 14 : భోగి పండుగను పురస్కరించుకుని కార్మిక వాడలు సంబరాలతో మురిసిపోయాయి. బుధవారం తెల్లవారుజామునే కార్మిక కుటుంబాలు తమ ఇళ్ల ముందు భోగి మంటలు వేసి సంప్రదాయ పద్ధతిలో పండుగను జరుపుకున్నారు. పాత వస్తువులు, ఎండు కట్టెలు, పనికిరాని సామగ్రిని మంటల్లో వేసి, పాతను విడిచిపెట్టి కొత్త జీవనానికి ఆహ్వానం పలికారు. భోగి మంటల చుట్టూ కుటుంబ సభ్యులు, పిల్లలు చేరి ఆనందంగా ఆటపాటలతో పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మహిళలు ఇళ్ల ముందు అందమైన ముగ్గులు వేసి, గొబ్బెమ్మలను ఏర్పాటు చేయగా వాడలంతా పండుగ శోభతో కళకళలాడాయి. చిన్నారులు కొత్త బట్టలు ధరించి భోగి మంటల వద్ద సందడి చేశారు. ఈ సందర్భంగా పలుచోట్ల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పండుగలు ఐక్యతను, పరస్పర స్నేహాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా కార్మికులు పేర్కొన్నారు.