జూబ్లీహిల్స్, అక్టోబర్ 24 : జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు దివంగత మాగంటి గోపీనాథ్ ఎంతో కృషి చేశారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తనను గెలిపిస్తే మాగంటి ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని.. మాగంటి బాటలో ప్రజలకు మరిన్ని సేవలందిస్తానని పేర్కొన్నారు.
యూసుఫ్‌గూడ డివిజన్లో కుమారుడు మాగంటి వాత్సల్యనాథ్‌తో కలిసి ఓటర్లను కలిసి కారు గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్ హయాంలో మాగంటి చేసిన అభివృద్ధి పనులపై ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుండడంతో ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. కార్యక్రమంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా, కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్, రాసూరి సునీత, సామల హేమ, మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె నివేదిత, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంతోష్ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ నర్సింగ్‌దాస్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.