Hyderabad | గోల్నాక, అక్టోబర్ 24 : చెల్లికి గుడ్ బాయ్ చెప్పి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌కు చెందిన టి.అనసూయ కుమారుడు శివకుమార్ (24) ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగి. అనసూయ తన కూతురు గంగాభవానితో కలిసి బయటకు వెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో శివకుమార్ తన చెల్లి గంగాభవానికి వాట్సాప్‌లో గుడ్ బాయ్ అంటూ మెసేజ్ చేసి ఫోన్ స్విఛ్చాఫ్ చేశాడు. వెంటనే వారు ఆందోళనతో ఇంటికి వచ్చి చూడగా శివకుమార్ ఉరి వేసుకొని నిర్జీవంగా కనిపించాడు. మృతుడి తల్లి అనసూయ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శివకుమార్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.