ఆదిలాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, రైతు సంఘాల నాయకులు, మార్కెటింగ్, వ్యవసాయశాఖ అధికారులతో కలిసి ఆదిలాబాద్‌లోని మార్కెట్‌యార్డులో పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ ఏడాది నుంచి కపాస్ కిసాన్ యాప్ ద్వారా పంట కొనుగోలు చేస్తుండడంతో ఎంపిక చేసిన కొంతమంది రైతుల వద్ద నుంచి స్లాట్ బుకింగ్ విధానంలో పంటను కొనుగోలు చేశారు. ఈ నెల 27 నుంచి జిల్లాలో కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకున్న రైతులందరి నుంచి పత్తిని కొనుగోలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 47 ప్రాంతాల్లోని స్లాట్ బుకింగ్ కోసం సహాయకులను నియమించినట్లు తెలిపారు.
రైతులు పంటను సీసీకి విక్రయించి క్వింటాలుకు రూ.8110 మద్దతు ధర పొందాలని, నిబంధనల ప్రకారం 8 నుంచి 12 శాతం తేమ ఉండాలని వివరించారు. 8 శాతం తేమ తక్కువ ఉన్న రైతులకు సీసీఐ ప్రీమియం చెల్లిస్తుందన్నారు. పంట విక్రయానికి రైతు రాని పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యులు వచ్చినా పంట కొనుగోలు చేస్తామని తెలిపారు. కొనుగోళ్లను మానిటరింగ్ కమిటీలు పర్యవేక్షిస్తాయని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండి సమస్యలు పరిష్కరిస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు.
ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో కంట్రోల్ రూంతో పాటు స్లాట్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో త్వరలో సోయా కొనుగోళ్లు జరిగే అవకాశాలున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు బండి దత్తాద్రి, గోవర్ధన్ యాదవ్, విఠల్, అడిషనల్ ఎస్పీ సురేందర్‌రావు, డీఎస్పీ జీవన్‌రెడ్డి, మార్కెటింగ్ ఏడీ గజానంద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, సీసీఐ అధికారులు పాల్గొన్నారు.