న్యూఢిల్లీ, అక్టోబర్24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యనేత బృందం తాజా ఢిల్లీ పర్యటనపై (Delhi Tour) రాజకీయ వర్గాల్లో అనుమానాలు మొదలయ్యాయి. డీసీసీ అధ్యక్షుల ఎంపిక మీద కీలక చర్చలు అని పైకి చెప్తున్నా, బీహార్ గురించేనని ప్రచారం జరుగుతున్నది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) కోసం తెలంగాణ నుంచి ఇప్పటివరకు తరలించిన మూటలు, ఇకపై మోయాల్సిన బరువుల మీదే కీలక చర్చ జరగనున్నదని కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కర్ణాటక నుంచి అధిష్ఠానానికి ఆశించిన మేర సహకారం లేకపోవడం, బీహార్‌లో కూటమి పొత్తులు వికటించి, స్నేహపూర్వక పోటీలకు దిగుతున్న నేపథ్యంలో అంచనా ఖర్చులు మించిపోతున్నాయని ఢిల్లీ పెద్దలు ఆందోళనతో ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నేతల సహకారంతోనే బీహార్ ఎన్నికలను నెట్టుకురావాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం.
గతంలోనే లెక్కలు.. చేరిన ముల్లెలు?
బీహార్ ఎన్నికలకు ఎంత కావాలి? తెలంగాణ నుంచి ఎంత బరువు మోయా లి? అనే అంశంపై ఈ ఏడాది జూలైలోనే లెక్కలు ఖరారైనట్టు విశ్వసనీయంగా తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశ ంపై న్యాయ నిపుణుల సలహా తీసుకునేందుకని ముఖ్యనేత బృందం జూలైలో ఢిల్లీకి వెళ్లింది. బీసీ మంత్రులు న్యాయ నిపుణులతో 30 నిమిషాలు మాట్లాడి మమ అనిపించగా, దీనికి ముఖ్యనేత హాజరు కాలేదు. ఆయనతోపాటు నంబర్ 2గా చెప్పుకొనే నేత, మరో కీలక నేత కలిసి ఢి ల్లీలో ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారితో ప్రత్యేకంగా సమావేశమైనట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
ఆ భేటీలోనే బీహార్‌కు ఎంత అవసరం అని చర్చించి, లెక్కలు పంచినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణకు రూ.300 కోట్లు, కర్ణాటకకు రూ.250 కో ట్ల లక్ష్యం నిర్దేశించినట్టు సమాచారం. తెలంగాణ నుంచి అనుకున్నట్టుగానే 2 ద ఫాల్లో మూటలు వెళ్లినట్టు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. హర్యానా ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి నిధులు వెళ్లకుండా కేంద్ర నిఘా వర్గాలు నంబర్ 2 నేత ఇంటిపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి అలాంటి ప్ర మాదం జరగకుండా మొదటి విడతలో ప్రత్యేక విమా నం ద్వారా కేరళకు నిధులు చే ర్చారని, రెండో విడతలో నంబర్ 2 నేత 10 రోజు ల కిందట ఆకస్మికంగా ఢిల్లీకి వెళ్లి అక్కడే వ్యవహారం సెట్ చేశారని సమాచారం. అక్కడి నుంచి సింహభాగం ఇప్పటికే బీహార్‌కు చేరినట్టు చర్చ జరుగుతున్నది.
చేతులెత్తేసిన కర్ణాటక
కర్ణాటక నుంచి బీహార్‌కు వెళ్లాల్సిన నిధులు ఆగిపోయినట్టు ప్రచారం జరుగుతున్నది. నిధులు సమకూర్చేందుకు అక్కడి ముఖ్యనేత ఒకరు విముఖత వ్యక్తంచేసినట్టు తెలిసింది. ‘పదవులు ఒకరికిచ్చి నాకు మాత్రం డబ్బుల ముల్లెలు తయారుచేసి, మోసే బాధ్యత ఇస్తారా?’ అంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారట! దీంతో ఇప్పటివరకు కర్ణాటక నుంచి కొంత మొత్తమే చేరినట్టు తెలిసింది. మిగిలిన డబ్బును ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి టెండర్ బాధ్యతలు అప్పగించటం ద్వారా సమీకరించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ కంపెనీ పనులకు సంబంధించి ఈ నెల 24న టెండర్లు జరుగాల్సి ఉండగా, అనివార్య కారణాలతో వారం కిందటే నోటిఫికేషన్ రద్దు చేసినట్టు తెలిసింది.
దీంతో కంపెనీ నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. ఫలితంగా కర్ణాటక నేతలు చేతులెత్తేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ప్రత్యామ్నాయంగా తెలంగాణ వైపు చూస్తున్నట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈనేపథ్యంలోనే రాష్ట్ర నేతలను అత్యవసరంగా ఢిల్లీకి రమ్మని పిలిచినట్టు చెప్పుకొంటున్నారు. ఎలాంటి కారణం లేకుండా ముఖ్యులంతా ఢిల్లీకి వెళ్తే కేంద్ర నిఘా వర్గాలకు, రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలకు అనుమానం వస్తుందనే అనుమానంతో డీసీసీల ఎంపిక వంక పెట్టుకొని ఢిల్లీ వెళ్తున్నట్టు తెలిసింది.