జైనథ్, అక్టోబర్ 24 : సోయాబీన్ పంటను వెంటనే కొనాలని జైనథ్ మండల మాజీ ఎంపీపీ మార్సెట్టి గోవర్ధన్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గణేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం జైనథ్‌లోని మార్కెట్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేతికి వచ్చిన పంట అకాల వర్షాలతో తడిసిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గొడం నగేశ్, కేంద్ర ప్రభుత్వం సోయాబీన్‌ను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామన్న మాట కాగితాలకే పరిమితమైందన్నారు. మద్దతు ధర కంటే తక్కువ రేటుకు దళారులు కొనడంతో రైతులు నష్టపోతున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు నిండా మునుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పంటను కొనకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కిసాన్ యా ప్ ద్వారా కొనుగోలు విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మార్కెట్ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ భోరజ్ మండలాధ్యక్షుడు ఊశన్న, నాయకులు పట్టెపు విలాస్, పీ వెంకట్ రెడ్డి, సంతోష్ రెడ్డి, గంగన్న, విలాస్, వెంకన్న, కోరెడ్డి నర్సింగ్, పురుషోత్తం యాదవ్, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇచ్చోడ, అక్టోబర్ 24 : సోయాబీన్ పంటను వెంటనే కొనాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతు స్వరాజ్య వేదిక ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న డిమాండ్ చేశారు. శుక్రవారం ఇచ్చోడలోని వ్యవసాయ మారెట్ యార్డు ఎదుట రోడ్డుపై రైతులతో కలిసి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్ట్, సెప్టెంబర్‌లో కురిసిన అతి భారీ వర్షాలకు పత్తి, సోయాబీన్, మొకజొన్న పంటలు దెబ్బతిన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకూ ఒక రైతుకూ ఇవ్వలేదన్నారు.
ఈ సంవత్స రం సోయాబీన్ పంట సాగు చేసిన రైతుల్లో 8 మంది అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. సోయాబీన్ పంటకు మద్దతు ధర రూ.5328 ఉంటే ఇదే పంటని ప్రైవేట్ మారెట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.4100కు కొని రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, నాఫెడ్, మార్ఫెడ్ అధికారులు చొరవ చూపి కొనాలన్నారు. ఈ నిరసనలో రైతులు కే.సంజీవ్, రవీందర్ సింగ్, రాజారెడ్డి, మారుతి, గంగాధర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.