Sunitha Laxma Reddy | నర్సాపూర్, ఏప్రిల్ 5: రానున్న రోజుల్లో మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో సునీతా లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి సునీతా లక్ష్మారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే మళ్లీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. తన ఊపిరి ఉన్నంతవరకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటానని వెల్లడించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు పెడుతున్న అక్రమ కేసులకు అధైర్యపడొద్దని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తాను ఒక్క అడుగు ముందుకేస్తే లక్షల అడుగులు మీరేస్తూ వెనుకాలే ఉంటారన్న నమ్మకం, విశ్వాసంతో ముందుకెళ్తున్నానని చెప్పారు.
కార్యకర్తలే ధైర్యం, కార్యకర్తలే తనకు దైవమని ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు. మంచికి చెడుకు, సంతోషానికి, దుఃఖానికి తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. సదా మీ సేవలో ఉంటానని వెల్లడించారు.