కొల్లాపూర్ : ఉపాధ్యాయుల బాధ్యతరాహిత్యం కారణంగా నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థులు గాయపడ్డారు. మండల కేంద్రం నుంచి సాతాపూర్ జిల్లా పరిషత్‌కు చెందిన హైస్కూల్ విద్యార్థులు బొలెరో లో ( Bolero vehicle ) పాఠ్యపుస్తకాలను తీసుకువస్తుండగా ఆ వాహనం బోల్తా ( Over turn ) పడింది.

ఈ ప్రమాదంలో 9వ తరగతికి చెందిన నాని, నందు చరణ్ తేజ, కార్తీక్, శివ, ఆనంద్
కు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో శివ అనే విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో అతడిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. పాఠ్యపుస్తకాల తరలింపు విషయంలో కూలీలలను ఏర్పాటు చేసుకోవాలని, విద్యార్థుల చేత పనులు చేయించుకోవద్దని స్పష్టంగా నిబంధనలు ఉన్నప్పటికీ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు అందుకు భిన్నంగా వ్యవహరించారు. 5గురు విద్యార్థులను బొలెరో వాహనంలో పంపి ప్రమాదానికి కారకులయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

వాహనం బోల్తా పడిన వెంటనే గుర్తించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన విద్యార్థులను హుటా హుటిన నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
కలెక్టర్ తో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే బీరం
పెద్దకొత్తపల్లి మండలంలో జరిగిన ప్రమాదంపై మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ( Harsavardan Reddy ) విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. అనంతరం ఘటనపై జిల్లా కలెక్టర్ సంతోష్‌తో ఫోన్లో మాట్లాడారు . ఘటనకు గల కారణాలపై విచారణ జరిపించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులతో పని చేయించడం దుర్మార్గమైన చర్యని ఆరోపించారు.