నడిగడ్డ పోలీసులకు అవినీతి మరక అంటుకున్నది. కొందరు విమర్శల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలు ఖాకీ వ్యవస్థకు మచ్చ తెస్తున్నాయి. ఆరోపణలు వచ్చిన అధికారులకు ఖద్దరు నేతలు అండగా నిలుస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. అందుకే కాపాడుతున్న ప్రజాపత్రినిధుల మాటలకే ఎక్కువగా విలువ ఇస్తున్నారు. ఇటీవల కేటీదొడ్డి పోలీస్ స్టేషన్ సిబ్బంది వసూళ్ల పర్వం జోగుళాంబ గద్వాల జిల్లాలో కలకలం రేపింది. దీంతో ఆరోపణలు ఉన్న ఎస్సైతోపాటు కానిస్టేబుల్‌ను ఏఆర్‌కు ఎస్పీ అటాచ్ చేశారు. అదే మండలం పాగుంట జాతరలో దుకాణాదారుల నుంచి కానిస్టేబుల్ మామూళ్లు వసూలు చేసినట్లు సోషల్ మీడియాలో పుకార్లు వెల్లువెత్తాయి. మనస్తాపం చెందిన సదరు పీసీ.. పై అధికారి చెబితేనే చేశానని.. తాను మనస్తాపం చెందానని.. ఆత్మహత్య చేసుకుంటానంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు వైరల్‌గా మారడంతో ఎస్పీ స్పందించి సదరు కానిస్టేబుల్‌తోపాటు ఎస్సైపై చర్యలకు ఆదేశించారు. దీంతో పోలీస్ శాఖలో అవినీతి ఖాకీల గుండెల్లో గుబులు మొదలైంది.
– గద్వాల, నవంబర్ 10
నడిగడ్డ పోలీస్ యంత్రాంగం రోజురోజుకూ విమర్శల వలయంలో చిక్కుకొంటున్నది. వరుసగా జరుగుతున్న ఘటన లు, అవినీతి ఆరోపణలు ఖాకీ వ్యవస్థకు మచ్చతెస్తున్నాయి. ఎన్ని ఆరోపణలు వచ్చినా అవి మాకు పట్టవు అన్నట్టుగా కొం దరి తీరు ఉన్నది. జిల్లాలో కొన్ని పోలీస్ స్టేషన్లలో కొందరు ఖాకీలు చేసే అవినీతి వ్యవహారంతో నిబద్ధతతో పని చేస్తున్న మరికొందరిపై పడడంతో వారు కూడా నిజాయితీగా పని చే యలేకపోతున్నారు.
అవినీతి పోలీసులను ఇక్కడి ప్రజాప్రతినిధులు కాపాడుతున్నారు. దీంతో వారు మరింత అవినీతి మరకలు అంటించుకుంటున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఏపీ, కర్ణాటక రాష్ర్టాలకు సరిహద్దుగా ఉండడంతో అక్రమ వ్యాపారాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నది. ఇదే అదునుగా భావించిన కొందరు ఖాకీలు సైతం అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. కర్ణాటక, తెలంగాణ సరిహద్దు మండలమైన కేటీదొడ్డి పోలీస్ స్టేషన్ సిబ్బంది వసూళ్ల పర్వం జిల్లాలో కలకలం రేపుతున్నది.
అక్కడ పనిచేస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సైతోపాటు ఓ కానిస్టేబుల్‌ను ఏఆర్‌కు అటాచ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పోలీసు శాఖలో అవినీతి ఖాకీల గుండెల్లో గుబులు మొదలైంది. అదే మండలం పాగుంటలో ఇటీవల జరిగిన జాతర లో దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారి నుంచి మామూళ్లు వసూలు చేసినట్లు, ఆ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌పై సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. దీనికి మనస్తాపం చెందిన ఆ కానిస్టేబుల్ ‘నేను ఒక్కడినే చేయలేదు.. పై వారు చెబితే చేశాను.. నన్ను ఏఆర్‌కు అటాచ్ చేయడం మానసికంగా కుంగదీసింది’.. అని ఆ కానిస్టేబుల్ సోషల్ మీడియాలో పోస్టు చేసి తొలగించాడు.
డబ్బులు వసూలు చేయమని చెప్పిన వారిపై చర్యలు తీసుకోకుండా తనపై యాక్షన్ చేపట్టడంతో మనస్తాపం చెందానని.. తాను ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియాలో పోస్టుపెట్టడం.. అది వైరల్‌గా మారడంతో ఎస్పీ విచారణకు ఆదేశించారు. అనంతరం ఎస్సైతోపాటు కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్నారు. ఈ ఇద్దరు ఖాకీలపై చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లాలో పని చేస్తున్న ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను ఏ స్టేషన్‌కు బది లీ చేసినా ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏడాదిలోనే రెండు పోలీస్ స్టేషన్లకు ట్రాన్స్ఫర్ చేసినా ఆయనలో తీరులో మార్పు రాకపోవడంతో నారాయణపేట జిల్లాకు బది లీ చేశారు. పాగుంట జాతరలో ఓ పోలీస్ అధికారి పాత్రపై అదనపు ఎస్పీ విచారణ చేపట్టారు.
ఈ విచారణలో ఆయనపై అవినీతి ఆరోపణలు బయట పడ్డట్టు తెలిసింది. తనను బదిలీ లేదా వీఆర్‌లో ఉంచుతారని గ్రహించిన ఆ ఖాకీ.. ఓ ఖద్దరు ప్రజాప్రతినిధిని ఆశ్రయించగా నిన్ను ఎక్కడికీ బదిలీ చేయరు.. వీఆర్‌కు పంపరు.. అంటూ అభయం ఇవ్వడంతో ప్రస్తుతం ఆ ఖాకీ ఇల్లు సర్దుకుంటున్నట్లు తెలిసింది. గతంలో మల్దకల్ మండలంలో మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అక్కడి ఖాకీలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. వీటితోపాటు నదీతీర ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లలో కొందరు ఖాకీలు ఇసుక, మట్టి మాఫియాకు సహకరిస్తూ అవినీతి మరకలు అంటించుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు.
ఈ మధ్య కాలంలో సామాజిక బాధ్యతతో తాగునీరు అందించే సంస్థ స్మార్ట్ ఇండియా ప్రైవే ట్ లిమిటెడ్ ఆస్తులపై కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టి ంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిపై చర్యలు తీసుకొని న్యా యం చేయాలని సంస్థ ఎండీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోపాటు అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులకు పోలీసులు సహకరించారని బాధితుడు వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసి 70 రోజులైనా పట్టించుకోకపోవడంతో స్మార్ట్ ఇండియా చైర్మన్, ఎండీ కరుణాకర్‌రెడ్డి మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి ఎస్పీకి నోటీసులు జారీ అయినట్లు తెలిసింది.
నడిగడ్డ ఖాకీలు ఖద్దరు నాయకులు చెప్పే మాటలకు విలువనిస్తూ సామాన్యులను పట్టించుకోవడం లేదనే వి షయం ఈ ఘటన మేరకు తెలుస్తున్నది. దీంతోపాటు రా ష్ట్రంలో సంచలనం సృష్టించిన తేజేశ్వర్‌ను హత్య చేసిన వారి నుంచి కూడా ఖాకీలకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంపై ఉన్నతాధికారులు ప్రత్యేక అధికారులతో విచారణ చేయిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలోని కేటీదొడ్డి పోలీస్ స్టేషన్‌తోపాటు జిల్లా కేంద్రంలోని ఓ పీఎస్‌పై అవినీతి ఆరోపణలు వినపడుతున్నాయి. ఇలా ప్రతి స్టేషన్లో పని చేస్తున్న కొందరిపై ఆరోపణలు సర్వసాధారణంగా మారిన పరిస్థితి జిల్లాలో నెలకొన్నది. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు స్పందించి నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని జిల్లా ప్రజల అభిప్రాయం.