Litchi Fruits | ఒకప్పుడు విదేశాలకు చెందిన రకరకాల పండ్లను తినాలంటే అవి కేవలం మనకు నగరాల్లోనే లభించేవి. కానీ ప్రస్తుతం అలాంటి పండ్లు గ్రామీణ ప్రాంతాల్లోనూ మనకు లభిస్తున్నాయి. అలాంటి పండ్లలో లిచి పండ్లు కూడా ఒకటి. ఇవి ప్రస్తుతం మనకు ఎక్కడ పడితే అక్కడ రహదారు పక్కన బండ్లపై దర్శనమిస్తున్నాయి. చూసేందుకు పింక్ లేదా ఎరుపు రంగులో ఈ పండ్లు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. లోపల తెల్లని గుజ్జు, నల్లని విత్తనాలను కలిగి ఉంటాయి. అచ్చం క్రీమ్ లాంటి రుచి, మృదుత్వాన్ని ఈ పండ్లు కలిగి ఉంటాయి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే లిచి పండ్లు మనకు ఎన్నో పోషకాలను అందిస్తాయి. పలు వ్యాధులను నయం చేసుకునేందుకు సహాయం చేస్తాయి. లిచి పండ్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు.
లిచి పండ్లలో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. రోజూ ఒక కప్పు లిచి పండ్లను తింటే మనకు రోజుకు కావల్సిన విటమిన్ సిలో 100 శాతం వరకు పొందవచ్చు. విటమిన్ సి వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తెల్ల రక్త కణాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల రోగాలు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ముఖ్యంగా సీజనల్గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకం తగ్గేలా చేస్తుంది. పేగుల్లో ఆహారం కదలికలను సరి చేస్తుంది. దీంతో ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి తగ్గుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. అలాగే మనం తినే ఆహారాల్లో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది.
లిచి పండ్లలో ప్రో ఆంథో సయనైడిన్స్ అనే పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటాయి. కనుక లిచి పండ్లు సహజసిద్ధమైన యాంటీ వైరల్ ఔషధంగా పనిచేస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల వైరస్ ఇన్ఫెక్షన్లను, వాటి కారణంగా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులను తగ్గించుకోవచ్చు. ఈ పండ్లలో లిచిటానిన్ ఎ2 అనే సమ్మేళనం ఉంటుంది. ఇది వైరస్లను నాశనం చేస్తుంది. దీని వల్ల వైరస్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. లిచి పండ్లను తినడం వల్ల పొటాషియం, కాపర్ అధికంగా లభిస్తాయి. ఇవి శరీరంలో రక్త సరఫరా మెరుగు పడేలా చేస్తాయి. దీని వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండ్లను తింటే ఐరన్ అధికంగా లభించి రక్తం తయారవుతుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది.
లిచి పండ్లను తినడం వల్ల పొటాషియం అధికంగా లభించి శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడిన వారు ఈ పండ్లను తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. పొటాషియం కారణంగా రక్త నాళాలు వెడల్పుగా మారుతాయి. దీంతో రక్త సరఫరా మెరుగు పడి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. లిచి పండ్లు చర్మానికి సైతం ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అధిక మొత్తంలో లభిస్తాయి. దీంతో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మం కాంతివంతంగా మారేలా చేస్తుంది. చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతుంది. వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకోవచ్చు. యవ్వనంగా కనిపిస్తారు. లిచి పండ్లను తినడం వల్ల అధికంగా ఉన్న బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ పండ్లలోని ఫైబర్ బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఇలా ఈ పండ్లను తింటుంటే అనేక లాభాలు కలుగుతాయి.