అడుగడుగునా జన నీరాజనాలు.. ఆత్మీయ పలకరింపులు..హామీలు..జై తెలంగాణ అంటూ హోరెత్తిన పల్లెలు
వీణవంక : పేదరికంలో కష్టపడి చదువుకొని పెరిగినోన్ని..పేదల కష్టాలు తెలిసినోన్ని ..మీ కళ్ళ ముందు అమ్మా..బాపు అంటూ తిరుగుతూ ఉద్యమంలో జైలుకు పోయినోన్ని నన్ను ఆశీర్వదిస్తే హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మండలంలోని చల్లూరు గ్రామంలో జరిగిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న గెల్లు అనంతరం మల్లారెడ్డిపల్లి, నర్సింలపల్లి, నర్సింగాపూర్, లస్మక్కపల్లి, వల్భాపూర్ గ్రామాలలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవెందర్‌రెడ్డితో కలిసి శుక్రవారం విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్బంగా ప్రజలనుద్దేశించి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గ్రామాలల్లో ఉన్న పేద ప్రజలకు డబుల్బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తడని సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గానికి 4 వేల ఇండ్లు మంజూరు చేస్తే ఓట్లు వేసి గెలిపించిన పాపానికి ఈటల రాజేందర్ ఒక్క ఇళ్ళు కూడా కట్టియ్యలేదని అన్నారు.
పేదలపై నిజంగా ఈటలకు ప్రేమ ఉంటే మిగతా మంత్రుల లాగా ఇండ్లు కట్టించి, పట్టుబట్టలు పెట్టి, గృహప్రవేశాలు చేపించకపోవునా అని పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి చెందాలని ఉంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని ఉంటే హైదరాబాద్‌లో కట్టించిన మెడికల్ కాలేజీ హుజూరాబాద్‌లో కట్టించకపోవునా అని ప్రశ్నించారు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండాలని ఈటల రాజేందర్‌ను గెలిపిస్తే ఎందుకు రాజీనామా చేశాడో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇప్పటి వరకు చెప్పలేదని అన్నారు.
సమాజంలో అణగారిన, ఆర్థికంగా వెనుకబడిన దళిత జాతి కోసం సీఎం కేసీఆర్ గొప్ప సాహసం చేసి దళిత బంధు పథకంతో ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తుంటే ఈ బీజేపోళ్ళు వాళ్ళకే ఇస్తరా..బీసీలకు, ఓసీలకు ఇవ్వరా అని తగువులు పెడుతున్నారని అన్నారు. కళ్యాణ లక్ష్మీ ఎలా అయితే దళితుల నుండి ప్రారంభమయి కులాలు, మతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అదజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దని తెలిపారు.
బీజేపీ వాళ్ళవి ఇచ్చే మొఖాలు కావు.. సచ్చే మొఖాలు కాదని ప్రతీ పనికి అడ్డుపడటమే వాళ్ళ పనని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాట కన్నా ఎక్కువ లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చి ఎన్నో కుటుంబాలకు అండగా నిలబ డితే, అధికారంలోకి వస్తే ప్రతీ సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పటికీ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకపోగా ఎన్నో ఉద్యోగాలను ఊడగొట్టి ఎంతో మంది ఉద్యోగుల ఉసురుపోసుకున్న పార్టీ బీజేపీ పార్టీని ధ్వజమెత్తారు.
అలాంటి పార్టీలో చేరిన ఈటల రాజేందర్‌కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. రైతును రాజును చేయాలని సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసి, 24 గంటల విద్యుత్ ఇస్తుంటే..నల్ల చట్టాలు తెచ్చి రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్న బీజేపీని, న్యాయం కావాలని అడిగిన రైతులను కార్లతో తొక్కించి చంపిన పార్టీ బీజేపీ పార్టీని బొందపెట్టి అలాంటి పార్టీకి ఓటు వేయాలని అడుగుతున్న ఈటల రాజేందర్‌కు ఈ నెల 30న కారు గుర్తుకు ఓటు వేసి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.
కోర్కల్, నర్సింలపల్లెలను పర్యాటక క్షేత్రాలుగా చేస్తా..
నన్ను ఆశీర్వదించండి మల్లారెడ్డిపల్లి గ్రామాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, మానేరు పరీవాహక గ్రామాలు కోర్కల్, నర్సింలపల్లెలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళి పర్యాటక క్షేత్రాలుగా చేస్తానని గెల్లు శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు.
టీఆర్ఎస్ పార్టీని గెలిపించండి నిరుద్యోగ సమస్యను తీర్చడానికి పేదలకు కార్పోరేట్ వైద్యం అందు బాటులోకి తీసుకు రావడానికి సీఎం కేసీఆర్ కృషితో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు 5 వేల ఇండ్లు పేదల కోసం కట్టించే బాధ్యత తీసుకుంటానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పార్టీ, సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలని , ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.