BJP : వివాదాస్పద విషయాలపై మాట్లాడడం.. ఆ తర్వాత దిద్దుబాటు చర్యలకు దిగడం బీజేపీకి పరిపాటి. అయితే.. కొందరు నాయకుల తీరుతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని గ్రహించిన రాష్ట్ర నాయకత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే ఏ అంశం మీదైనా సరే.. పార్టీ లైన్‌కు విరుద్ధంగా మాట్లాడకూడదని పార్టీ నాయకులకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ సూచించింది.
అనధికారికంగా మీడియా వేదికగా వ్యాఖ్యలు చేయరాదని కూడా స్పష్టం చేసింది. ఈమధ్యే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఎన్. రాంచందర్ రావు ఆదేశాల మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి (Premender Reddy) ఈ సూచనలు చేశారు.
సున్నితమైన, వివాదాస్పద అంశాలపై పార్టీ నాయకత్వం అనుమతి లేకుండా పత్రికలకు సమాచారం ఇవ్వడం లేదా మీడియా ముందుకు వెళ్లి మాట్లాడడం వంటివి చేయకూడదని ప్రేమేందర్ రెడ్డి సూచించారు. కేవలం పార్టీ సూచించిన వ్యక్తులే మీడియా వేదికగా మాట్లాడాలని ఆయన వెల్లడించారు. అంతేకాదు ఎమ్యెల్యే మాగంటి గోపినాథ్ (Maganti Gopinath) అకాల మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ నేపథ్యంలో ఈ బై ఎలక్షన్‌పై కూడా అనవసర కామెంట్లు చేయకూడదని ప్రేమేందర్ రెడ్డి పేర్కొన్నారు.