బంజారాహిల్స్,జూలై 18: జూబ్లీహిల్స్ రోడ్ నెం -1లో జీహెచ్ఎంసీకి చెందిన వరదనీటి నాలాను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించిన వ్యవహారంపై నమస్తేతెలంగాణ పత్రికలో కథనంతో బల్దియా అధికారులు స్పందించారు. జీహెచ్ఎంసీ సర్కిల్-18 టౌన్‌ప్లానింగ్ అధికారులు శుక్రవారం జూబ్లీహిల్స్ రోడ్ నెం 1లోని ప్లాట్ నెం 65, ప్లాట్ నెం 49(సి)కి మధ్యనున్న నాలా ఆక్రమణలను పరిశీలించారు. నాలాపై అక్రమంగా నిర్మించిన షెడ్లను, గదులను తొలగించాలని సంబంధిత వ్యక్తులను ఆదేశించారు.
దీంతో పాటు ప్లాట్ నెం 49(సి)కి చెందిన ప్రహరీ గోడను నాలా బఫర్ జోన్లో నిర్మించినట్లు తేలడంతో వారిపై కూడా త్వరలో చర్యలకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. కాగా, నాలాపై ఏర్పాటు చేసిన షెడ్లను, గదులను తొలగించేందుకు రెండురోజుల గడువు కోరారని, అప్పటిలోగా ఆక్రమణలను తొలగించకపోతే తాము రంగంలోకి దిగి కూల్చివేతలు చేపడతామని సర్కిల్-18 టౌన్‌ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.