బంజారాహిల్స్,జూలై 18: గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు సంక్షేమ ఫలాలను ఇంటింటికీ అందించిన దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెంగళరావునగర్ డివిజన్ బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించే అవకాశం వచ్చిందన్నారు.
ఒకవైపు వేల కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టడంతో పాటు సంక్షేమ పథకాలతో పేదలకు సాయం అందించడం వల్లనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని స్థానాలను గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని పటిష్టమైన శక్తిగా నిలిపిన ఎమ్మెల్యే మాగంటి ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటన్నారు. కాగా రానున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి మాగంటి గోపీనాథ్‌కు నివాళి అర్పించేందుకు కార్యకర్తలు, నేతలు కృషి చేయాలన్నారు.
18నెలల కాంగ్రెస్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, హైదరాబాద్ ప్రతిష్ట మసకబారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ఓటర్లంతా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాగంటి సునీతా గోపీనాథ్, కార్పొరేటర్లు దేదీప్యరావు, రాజ్‌కుమార్ పటేల్‌తోపాటు వెంగళరావునగర్ డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.