న్యూఢిల్లీ, జనవరి 29: మొదట పిలిచారు. ఆపై బతిమాలారు. ఇప్పుడు బెదిరింపులకు దిగుతున్నారు. క్లుప్తంగా ఇదీ రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ)ని తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ అనుసరిస్తున్న ఎత్తుగడ. యూపీ ఎన్నికల్లో గెలవాలంటే పశ్చిమ యూపీ చాలా కీలకం. అక్కడ ఆర్ఎల్డీ బలమైన శక్తిగా ఉన్నది. అందుకే ఆ పార్టీని ఎలాగైనా తమవైపునకు తిప్పుకునేందుకు బీజేపీ ఎన్నికల సారథి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయత్నాలు మొదలుపెట్టారు. తొలుత బీజేపీ ద్వారాలు తెరిచే ఉన్నాయని ఆర్ఎల్డ్డీకి ఆహ్వానం పలికారు. ఆర్ఎల్డీ నేత (పొత్తుకు) తప్పుడు ఇంటిని ఎంచుకున్నారని వ్యాఖ్యానించారు. అయితే అప్పటికే సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు కుదుర్చుకున్న ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరి ఈ ఆహ్వానాన్ని ఘాటుగానే తిరస్కరించారు. ఆహ్వానం పంపాల్సింది తనకు కాదని, వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అమరులైన 700 రైతుల కుటుంబాలను పంపాలని వ్యంగ్యంగా సూచించారు. తలుపులు మీకోసం బార్లా తెరిచే ఉన్నాయన్న బుజ్జగింపులు కూడా పనిచేయకపోవడంతో చివరకు అమిత్ షా బెదరింపులు, శాపనార్థాలకు దిగారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుక్షణం పొత్తు నుంచి ఆర్ఎల్డీ బయటకు రాక తప్పదని, ఎస్పీ అధికారంలోకి వస్తే ఆజంఖాన్ పెత్తనమే నడుస్తుందని రకరకాలుగా భయపెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే జయంత్ చౌదరి మాత్రం బీజేపీవైపు కన్నెత్తి చూడటం లేదు.
జాట్ల మద్దతు ఎవరికి?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రారంభానికి ఇంకా రెండు వారాలు కూడా లేదు. వచ్చే నెల 10న మొదటి విడుతలో భాగంగా పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో ఉన్న 58 స్థానాలకు పోలింగ్ జరుగనున్నది. రెండో విడుతలో 14న తొమ్మిది జిల్లాల్లో 55 సీట్లకు పోలింగ్ జరుగుతుంది. పశ్చిమ యూపీలోని ఈ 20 జిల్లాల్లో ముస్లింలు, దళితులతో పాటు జాట్ల జనాభా ఎక్కువ. ముస్లింలు, దళితుల ఓట్లు ఎలాగూ తమకు రావని గ్రహించిన బీజేపీ జాట్లను ఆకర్షించడం ద్వారా కొన్ని సీట్లనైనా రాబట్టుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా అమిత్ షా 250 మంది జాట్ నేతలతో సమావేశం అయ్యారు. వారిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే, జాట్లు అంతా ఏకపక్షంగా, తాము మొదటి నుంచి మద్దతు ఇస్తున్న ఆర్ఎల్డీ వెంటే ఉంటామని అమిత్ షాకు సంకేతాలిచ్చారు. ప్రస్తుతం ముస్లింల మద్దతు ఎక్కువగా సమాజ్‌వాదీ పార్టీకి ఉంది. బీఎస్పీ అంత క్రియాశీలకంగా లేని కారణంగా దళితులు కూడా ఎస్పీవైపే మొగ్గే అవకాశం ఉంది. ఆరెల్డీ మద్దతుతో జాట్ల మద్దతూ ఎస్పీకే ఉంది. ఈ నేపథ్యంలో హిందూత్వ కార్డుతో ఓట్లను చీల్చడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదు.
తొలి నుంచి ఆర్ఎల్డీ వైపే
జాట్లు ప్రధానంగా రైతులు. పశ్చిమ యూపీలో వీరి జనాభా 18%. ముస్లింలు(25%), దళితులు(19%) తర్వాత వీరే ఎక్కువ. 76 స్థానాల్లో గెలుపోటములను శాసించగల సంఖ్యాబలం వీరికి ఉంది. ముఖ్యంగా మీరట్, భాగపత్ జిల్లాల్లో జాట్లకు పట్టు ఎక్కువ. ఇక్కడ వీరి జనాభా 24% పైనే. జాట్లు మొదటి నుంచి ఆర్ఎల్డీకే మద్దతు ప్రకటిస్తున్నారు. కానీ, 2013లో ముజఫర్‌నగర్ అల్లర్ల తర్వాత జాట్ల ఓటింగ్ విధానంలో మార్పు వచ్చింది. వీరి మద్దతు బీజేపీ వైపు మళ్లింది. ప్రస్తుతం పశ్చిమ యూపీలో ఆర్ఎల్డీ 33 స్థానాల్లో పోటీ చేస్తున్నది.
బీజేపీ మైండ్ గేమ్
2014 లోక్‌సభ ఎన్నికల్లో, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో జాట్లు బీజేపీకి మద్దతు ఇచ్చారు. వివాదాస్పద సాగు చట్టాలతో సీన్ మారింది. రైతులైన జాట్లు సహజంగానే ఈ నల్ల చట్టాలను వ్యతిరేకించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఉద్యమం చేశారు. చట్టాలను తీసుకువచ్చినందుకు ఆ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో జాట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి మద్దతివ్వబోరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ మైండ్ గేమ్ మొదలుపెట్టి పశ్చిమ యూపీలో జాట్లకు ఎక్కువ టికెట్లు కేటాయిస్తున్నది. ఇదంతా ఎన్నికల స్టంట్‌గానే జాట్లు అర్థం చేసుకొన్నట్టు అమిత్ షా సమావేశంతో తేలింది.
బీజేపీకి అసలు షాక్ గుజరాత్లో: అఖిలేశ్
లక్నో, జనవరి 29: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు ఏమీ ఉండవని, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎస్పీ కూటమే అని పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అసలైన ఆశ్చర్యకరమైన ఫలితాలు ఈ ఏడాది ఆఖరులో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తారని పేర్కొన్నారు. రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ చీఫ్ జయంత్ చౌదరితో శనివారం అఖిలేశ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. యూపీ ప్రజలు ఇప్పటికే తమ తీర్పును వెల్లడించారని, బీజేపీ ఇప్పటికే ఓటమి భయంతో ఉందని అన్నారు. మహాత్మాగాంధీ హంతకులను గౌరవిస్తున్న వారికి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, రాబోవు ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో సంతోషాన్ని నింపుతాయన్నారు. రైతులు, యువకులు, ఇతర అన్ని వర్గాల ప్రజలు ఎస్పీ కూటమికి పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారని చెప్పారు.
యూపీలో అధికార దుర్వినియోగం: జయంత్
లక్నో, జనవరి 29: అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న యూపీలో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య హద్దులు చెరిగిపోతున్నాయని ఆర్ఎల్డీ నాయకుడు జయంత్ చౌదరి మండిపడ్డారు. సీఎం యోగి ప్రభుత్వ యంత్రాంగాన్ని బీజేపీ కోసం దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ టీచర్లను ర్యాలీలకు బస్సుల్లో తీసుకువెళ్తున్నారని, పోస్టల్ ఓట్లను గోల్మాల్ చేస్తున్నారని అన్నారు. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీతో పొత్తుపెట్టుకుని ఆర్ఎల్డీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్నది. వివాదాస్పద చట్టాలను తెచ్చిన బీజేపీపై రైతులు ఆగ్రహంతో ఉన్నారని చౌదరి అన్నారు. బీజేపీ ధోరణి పాడిందే పాడరా అన్నట్టుగా ఉన్నదని, మందిర్-మస్జిద్, జిన్నా, పాకిస్థాన్ మంత్రాన్ని పదేపదే వల్లిస్తున్నదని దుయ్యబట్టారు. బీజేపీకి ఇదొక అలవాటుగా మారిందని, 20 శాతం ప్రజలను (ముస్లింలు) పట్టించుకోకపోవడమే ఆ పార్టీ ఏకైక విధానమని అన్నారు.