BJP | న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 16 మంది సిట్టింగ్ ఎంపీ, 135 మంది ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) పేర్కొన్నది. ఈ మేరకు వారు 2019, 2024 మధ్య ఈసీకి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ పత్రాల్లో వెల్లడించారని తెలిపింది. కొంత మందిపై లైంగిక దాడి వంటి తీవ్రమైన అభియోగాలు కూడా ఉన్నాయని పేర్కొన్నది. నివేదిక ప్రకారం, ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలపై లైంగిక దాడి కేసులు ఉన్నాయి. నేరం రుజువైతే కనీసం పదేండ్ల శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు పడే అవకాశం ఉన్నది.
బీజేపీ నుంచి 54 మంది
పార్టీల పరం చూస్తే.. కేంద్రంలోని అధికార బీజేపీకి చెందిన 54 మంది ఎంపీ/ఎమ్మెల్యేలపై ఈ తరహా కేసులు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్-23 మంది, తెలుగుదేశం-17 మంది ఉన్నారని ఏడీఆర్ నివేదిక తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఐదుగురు చొప్పున చట్టసభల సభ్యులు మహిళలపై అత్యాచారం అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
మొదటి స్థానంలో పశ్చిమబెంగాల్
మహిళలపై నేరాలకు సంబంధించి కేసులు ఎదుర్కొంటున్న వారిలో పశ్చిమబెంగాల్ చట్టసభల సభ్యులు మొదటి స్థానంలో ఉన్నారని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. 25 మంది ఎంపీ/ఎమ్మెల్యేలు కేసులు ఎదుర్కొంటుండగా, తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ (21 మంది), ఒడిశా(17) ఉన్నాయి.