ఖమ్మం, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తమ పార్టీని రాజకీయం ఎదుర్కోలేకనే బీజేపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని, విద్వంసపూరిత చర్యలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఖమ్మంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం నగరంలో బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడే తమ పార్టీ కార్యకర్త సాయిగణేశ్‌ను రెచ్చగొట్టి ఆత్మహత్యకు ప్రోత్సహించడం సరికాదని అన్నారు. అతడు చనిపోయాక పోలీసులపైనా, మంత్రి పువ్వాడ అజయ్కుమార్పైనా ఆరోపణలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పోలీసులు వేధించడం వల్లనే సాయిగణేశ్ మృతిచెందాడనడం అవివేకమన్నారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి విచారణకైనా టీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు.. తమ కార్యకర్తలను రెచ్చగొట్టే విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించడం, ప్రభుత్వ ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేయడం వంటి విద్వంసపూరిత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామమన్నారు. బీజేపీ నేతలు ఆటవిక చర్యలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు.
సాయిగణేశ్ మృతికి గల వాస్తవాలను తెలుసుకోకుండా ఆస్తులను ధ్వంసం చేయడం భావ్యం కాదన్నారు. భౌతికదాడుల ద్వారా టీఆర్ఎస్ను ఎదుర్కోవడం బీజేపీ వల్ల కాదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్కు ప్రజల్లో ఉన్న ఆదరణను, అభిమానాన్ని చూసి తట్టుకోలేకనే బీజేపీ నేతలు.. మంత్రి అజయ్‌పైనా, టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్పై బురదజల్లే విధానాలకు స్వప్తి పలకకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో అరాచకాలు, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. కానీ ఆ పార్టీ నేతల ఆటలను ఖమ్మంలో సాగనివ్వబోమని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు.. అమాయకుణ్ని ఆత్మహత్య వైపు ప్రేరేపించి బలిచేశారని, రాజకీయ మనుగడ సాధించలేక ఇలాంటి నీచమైన విధానాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. సాయిగణేశ్ మృతిచెందడం దురదృష్టకరమైన సంఘటన అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మంత్రి అజయ్‌పై బండి సంజయ్ విమర్శలు చేయడం సరికాదని అన్నారు.