కలెక్టరేట్, ఏప్రిల్ 24 : అమ్మచేతి గోరు ముద్దులు తింటూ.. అందరితో కలిసిమెలిసి కేరింతలు కొడుతూ బడిబాట పట్టాల్సిన పిల్లల బాల్యం దుండగుల చేతిల్లో పడి వెట్టిచాకిరికి గురవుతున్నది. పలక, బలం పట్టాల్సిన చిన్నారి చేతులు రోడ్లపై భిక్షాటన కోసం యాచిస్తున్నాయి. ఎండకు ఎండి, వానకు తడిచి అందమైన బాల్యం ఛిద్రమైపోతున్నది. పిల్లల హక్కులను కాపాడాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తుండటంతో నగరంలో భిక్షాటన యధేచ్ఛగా కొనసాగుతున్నది. దుండగుల కర్కశ హస్తాల నంచి బాలలకు విముక్తి కలిగించాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పసిపిల్లలతో కొనసాగిస్తున్న భిక్షాటనను అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ ప్రభావం నగరంలో (Karimnagar) ఏ మాత్రం కనిపించటం లేదు. ఏటా రెండు సార్లు అధికార యంత్రాంగం రెస్క్యూ బృందాలతో తనిఖీలు చేపడుతున్నా కొద్దిరోజులు నిలుస్తున్నాయి. అనంతరం యధావిధిగా కొనసాగుతు న్నాయి. ఫిర్యాదులు చేస్తే గాలింపు చేపట్టి అదుపులోకి తీసుకుని చిన్నారులను సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారే తప్ప, యాచనకు ప్రోత్సహిస్తున్న మాఫియా ఆటకట్టించలేక పోతున్నారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి పిల్లలను తెచ్చి బస్ స్టాండులు, కూడళ్లు, జనావాసాలు ఉండే ప్రాంతాల్లో యాచన చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ఈజీ మనీకి అలవాటు పడి..
ఈజీ మనీకి అలవాటు పడ్డ ఇతర రాష్ట్రాలకు చెందిన కొంతమంది ముఠాలుగా ఏర్పడి ఆయా ప్రాంతాల నుంచి చిన్న పిల్లలతో సహా నగరానికి వచ్చారు. మురికి వాడలు, నగర శివార్లలో నివా సమేర్పరుచుకుని చిన్నారులతో భిక్షాటన చేయిస్తున్నారు. పలక, బలపం పట్టి పాఠశాలకు వెళ్లాల్సిన వయసులో నగర కూడళ్లు, జనం అధికంగా ఉండే ప్రాంతాలు, ముఖ్య కూడళ్లు, మార్కెట్లు, రద్దీ అధికంగా ఉండే పలుచోట్ల చిన్నారులతో మాస్కులు, ఇయర్ బడ్స్, హాండ్ కర్చిప్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మిస్తున్నారు. మరికొందరితో వాహ నాలను శుభ్రం చేయిస్తున్నారు. వందల సంఖ్యలో మహిళలు చంటి పిల్లలనెత్తుకుని భిక్షాటన చేస్తూ, పసిపిల్లల బాల్యాన్ని క్యాష్ చేసుకుంటున్నారు.
బాల్యాన్ని చిదిమేస్తూ..
ఎండనకా, వాననకా.. దుమ్ము, ధూళిలో తిప్పుతూ చిన్నారులను చిరుప్రాయంలోనే చిదిమేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తనిఖీలు చేపట్టి చిన్నారులను చేరదీశారు. వారికి ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో రెసిడెన్షియల్ విద్యను కూడా అందించారు. దీంతో గత 8 ఏళ్ల కాలంలో బెగ్గింగ్ వ్యవస్థ సమూలంగా తుడిచి పెట్టకపోయిందని అధికార వర్గాలే ప్రకటించాయి. అయితే గత ఏడాదికాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం బెగ్గింగ్ వ్యవస్థ పై ఉక్కు పాదం మోపకుండా, పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తుండటంతో, బెగ్గింగ్ మాఫియా పెట్రేగిపోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
చిన్నారులతో భిక్షాటన చేయిస్తూ వారి జీవితాలను అంధకారంలోకి నెట్టివేస్తున్నా అధికార యంత్రాంగం చోద్యం చేస్తుందనే విమర్శలు పెరుగుతున్నాయి. పలు స్వచ్ఛంద సంస్థలు కూడా బెగ్గింగ్ మాఫియా ఆగడాలపై ఫిర్యాదులు చేసినా, చర్యలుండటం లేదని ఆయా సంస్థల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి యాచక మాఫియా పై కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.
కౌన్సెలింగ్ చేస్తున్నాం..
కాగా, ఇదే విషయంతపై జిల్లా సంక్షేమాధికారి కె.సబిత, మాట్లాడుతూ చిన్నారులతో భిక్షాటన చేయించడం నేరమన్నారు. కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పిల్లల ప్రాథమిక హక్కులను హరిస్తూ ఎండ, వానలో తిప్పుతున్నారు. చిరుప్రాయంలోనే వారి ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ముందుగా భిక్షాటన చేసే వారిని గుర్తించి కౌన్సెలింగ్ చేస్తున్నాం. వినకపోతే కేసులు నమోదు చేస్తున్నాము. కొద్దిరోజులుగా నగరంలో బెగ్గింగ్ బెడద తగ్గిందని తెలిపారు.