శరీర యాత్రలో కీలకపాత్ర పోషించే కిడ్నీల వ్యాధుల సంకేతాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వాపులు, అలసట, మూత్రంలో మార్పులు, విడువని దురద, శ్వాస ఆడకపోవడం, ఆహార పదార్థాలు లోహపు వాసన వేయడం లాంటివి కీలక సంకేతాలు. తొలి దశలోనే సమస్యను గుర్తించాలి. ఇక రోగ నిర్ధారణలో మూత్ర పరీక్షలు, ఇమేజింగ్ లాంటివి భాగంగా ఉంటాయి. డయాబెటిస్, అధిక రక్తపోటు, కుటుంబ చరిత్రలో కిడ్నీ వ్యాధులు ఉన్నవాళ్లు స్క్రీనింగ్ చేయించుకోడం మంచిది. పెయిన్కిల్లర్లను అతిగా వాడేవాళ్లు కూడా కిడ్నీ వ్యాధుల విషయంలో ఓసారి ఆలోచించుకోవాలి. అలాగని ఇవే లక్షణాలు అనుకోవద్దు. కానీ హెచ్చరికలుగా భావించడంలో తప్పులేదు.
మడమలు, పాదాలు, ముఖ భాగాల్లో వాపు, మరీ ముఖ్యంగా ఉదయం వేళలో కండ్ల చుట్టూతా వాపు ఉంటే జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. అలసట, బలహీనత, రాత్రిళ్లు కాళ్లలో పోట్లు లాంటివి ఎన్నో ఇతర రోగాల వల్ల కూడా వస్తాయి. అయితే వీటిని కిడ్నీ సమస్యకు సంకేతంగా కూడా భావించాలి.
మూత్రం నురగగా ఉంటే అది మూత్రంలో ప్రొటీన్లు ఉన్నాయనడానికి సంకేతం. మూత్ర విసర్జన తర్వాత నీళ్లు పోసినప్పటికీ నురగ పోలేదంటే అది ప్రొటీనూరియా కావొచ్చు. ఇక నీళ్లు తగినన్ని తాగకపోతే మూత్రం తక్కువగా వస్తుంది. కిడ్నీలు వడపోయడానికి తగినన్ని నీళ్లు లేకపోతే ఈ సమస్య తలెత్తుతుంది. దీన్ని ఆలిగూరియా అంటారు. ఇక రోజులో మూత్రానికి తరచుగా వెళ్లే పరిస్థితి కూడా కిడ్నీ వ్యాధికి సంకేతంగానే భావించాలి.
అంతేకాదు నాక్టూరియా (రాత్రిళ్లు ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం) కూడా ఆలోచించాల్సిన సమస్యే. మూత్రంలో రక్తం పడుతుంటే కిడ్నీల్లో రాళ్లు, మూత్ర నాళ ఇన్ఫెక్షన్, మూత్రనాళం కిడ్నీల్లో సమస్యలకు హెచ్చరికగా పరిగణించాలి. ఈ లక్షణాలన్నిటికీ తగిన వైద్యపరమైన పరిశీలన అవసరమవుతుంది.
ఇది యూరేమియా సంకేతం. రక్తంలో యూరియా స్థాయులు, ఇతర నత్రజని సంబంధ వ్యర్థాలు పోగుపడ్డప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. శరీరమంతటా దురదగా అనిపిస్తుంటే అది యూరేమియా అయ్యే అవకాశం ఉంది.
చిన్నచిన్న దూరాలు నడుస్తున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయాసపడటం వంటి సమస్యలు శరీరంలో నీళ్లు అధికంగా పేరుకుపోవడం వల్ల తలెత్తుతాయి. ఇది శ్వాస సమస్యలకు దారితీస్తుంది. లోహపు రుచి, నోటి దుర్వాసన అన్ని రకాల ఆహార పదార్థాల రుచి మారిపోవడం కూడా కిడ్నీ వ్యాధుల లక్షణాల్లో ఒకటి. కాబట్టి కిడ్నీ వ్యాధులకు తొలిదశలోనే నిర్ధారణ చేయించుకోవాలి. తగిన చికిత్స తీసుకోవడం, భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఉండటానికి ఇది కీలకం.
రక్త పరీక్ష (సీరం క్రియాటినైన్).
మూత్ర పరీక్ష (యూరినాలిసిస్ అండ్ ఆల్బుమిన్ టూ క్రియాటినైన్ రేషియో).
అల్ట్రా సౌండ్ లేదా ఇమేజింగ్ (అవసరమైతేనే).
డయాబెటిస్, అధిక రక్తపోటు, కుటుంబ చరిత్రలో కిడ్నీ వ్యాధులు, పెయిన్ కిల్లర్లు, కొన్ని ఇతర ప్రత్యేకమైన మందులు అధికంగా వాడుతున్న వాళ్లు కిడ్నీ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి.