హైదరాబాద్/కాచిగూడ, నవంబర్ 2(నమస్తే తెలంగాణ) : పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాచిగూడలోని అభినందన్ హోటల్లో శనివారం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, సుధాకర్ ఆధ్వర్యంలో బీసీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతమున్న 12 బీసీ కుల ఫెడరేషన్లను బీసీ కార్పొరేషన్లుగా మార్చాలని పేర్కొన్నారు. రూ.5వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను మంజూరు చేయాలని, సబ్సిడీ రుణం రూ.10లక్షలు ఇవ్వాలని, బీసీ విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. 295 బీసీ కాలేజ్ హాస్టళ్లు, 321 గురుకుల పాఠశాలలకు సొంత భవనాలను నిర్మించాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి, విద్యాభివృద్ధికి పథకాలను అమలు చేయాలని తెలిపారు. బీసీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా ‘బీసీ యాక్టు’ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ కార్యాచరణపై 5న బీసీల మేధోమథన సదస్సును నిర్వహించనున్నట్టు వెల్లడించారు. బీసీ మేధావులు, ఉద్యోగులు, యువకులు, విద్యార్థులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షుడు సత్యం, రాజేందర్, నందగోపాల్, అనంతయ్య, రామకృష్ణ పాల్గొన్నారు.