సిటీబ్యూరో: నగర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పీపుల్ ప్లాజాలో బుధవారం బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. నగర వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చుకొని ఆడి పాడి సందడి చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. బతుకమ్మ విశిష్టతను, తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్రను ఆయన వివరించారు.
తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తొలిగించిన దుర్మార్గుడిని తరిమికొడదామన్నారు. పీపుల్స్ ప్లాజాను బతుకమ్మ ప్లాజాగా మార్చుకుందామని చెప్పారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బతుకమ్మ పాటలకు తనదైన శైలిలో స్టెప్పులేస్తూ అదరగొట్టారు. వేడుకల్లో ఎమ్మెల్యేలు పద్మారావుగౌడ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతిశ్రీనివాస్, రవీందర్రావు, వాణీదేవి, సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.