మంథని/మంథని రూరల్, సెప్టెంబర్ 24: రూపాయి కూడా పరిహారం అందించకుండా తన భూమిలో నేషనల్ హైవే నిర్మాణ పనులు ఎలా నిర్వహిస్తారంటూ ఓ భూనిర్వాసితుడు ఆందోళనకు దిగాడు. ఎక్స్కవేటర్కు అడ్డుగా పడుకొని పనులను అడ్డగించాడు. ఇది పెద్దపల్లి జిల్లా మంథని మండలం పుట్టపాకలో బుధవారం చోటుచేసుకున్నది. నేషనల్ హైవే నిర్మాణ పనుల్లో భాగంగా అధికారులు పుట్టపాకలో పొక్లెయిన్, జేసీబీ, చైన్ మెషిన్ల ద్వారా అడ్డుగా ఉండే పంట, ఇతర నిర్మాణాలను తొలగిస్తూ చదును చేస్తున్నారు. గ్రామానికి చెందిన ఇసంపల్లి రాధమ్మ అనే వృద్ధురాలి పేరు మీద ఉన్న 16 గుంటల భూమికి అధికారులు అవార్డు పాస్ చేయకుండా, నష్ట పరిహారం ఇవ్వకుండానే ఉదయం ఆ భూమిలో ఉన్న పత్తి పంటను ఎక్స్కవేటర్ సాయంతో అధికారులు తొలగించేందుకు సిద్ధపడ్డారు.
గమనించిన ఆమె కొడుకు ఇసంపల్లి చంద్రమూర్తి అధికారుల వద్దకు వెళ్లి తమకు పరిహారం ఇవ్వకుండా ఎలా భూములు స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. వారు వినకపోవడంతో చేసేదేమీ లేక బురదను సైతం లెక్క చేయకుండా ఎక్స్కవేటర్కు అడ్డుగా పడుకున్నాడు. అక్కడే ఉన్న పోలీసులు చంద్రమూర్తిని బలవంతంగా పక్కకు లాగడంతోపాటు ఆయన కుటుంబ సభ్యులను గదిలో బంధించారు. గ్రామస్థులు అడ్డు చెప్పినా అధికారులు వినకుండా వారి పని వారు చేసుకుంటూ వెళ్లారు. అనంతరం చంద్రమూర్తి, ఆయన భార్య సువర్ణ, తల్లి రాధమ్మతోపాటు ఇద్దరు పిల్లలను ఆర్డీవో కార్యాలయానికి తీసుకువచ్చారు. అక్కడికి వచ్చిన కలెక్టర్ శ్రీహర్షను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. నిబంధనల మేరకు పరిహారం అందిస్తామని చెప్పి కలెక్టర్ వెళ్లిపోయారు. అనంతరం పలువురు భూనిర్వాసితులు ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. పరిహారం ప్రకటించకుండానే భూములు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.
మమ్మల్ని బొందపెట్టి భూములు తీసుకోండి
మా అత్తమ్మ ఇసంపల్లి రాధమ్మ పేరు మీద మా ఊర్లో 16 గుంటల భూమి ఉంది. మాకున్న ఏకైక ఆధారం కూడా అదే. దానిమీద ఆధారపడే నేను, నా భర్త చంద్రమూర్తి, ఇద్దరు పిల్లలు, మా అత్తమ్మ జీవనం సాగిస్తున్నాం. మాకున్న 16 గుంటల భూమిలో 12 గుంటలు పోతుందని పంచాయతీలో అధికారులు చెప్పినా ఇప్పటివరకు రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదు. పరిహారం చెల్లించకుండా అధికారులు బుధవారం మెషిన్లతో వచ్చి మా పత్తి పంటను ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన నా భర్త, నన్ను, మా అత్తమ్మను, మా పిల్లలను ఆర్డీవో కార్యాలయానికి తీసుకువచ్చిండ్రు. ఇక్కడికి కలెక్టర్ వచ్చి రూ.6 లక్షల పరిహారం ఇస్తాం.. ఇప్పటికప్పుడు ఇల్లు, భూమిని వదిలి పెట్టాలని చెప్పారు. మేం ఏం మాట్లాడటానికి కూడా వీలు లేకుండా చేశారు. మా ఇంటికి, 12 గుంటల స్థలానికి, పత్తి పంటకు, కోళ్ల ఫారానికి అధికారులు కట్టే విలువ రూ.6 లక్షలా?. ఆ రూ.6 లక్షలతో ఎక్కడైనా భూమి వస్తుందా? మా భూమిలోనే మమ్మల్ని బొందపెట్టి తీసుకోండి.
-ఇసంపల్లి సువర్ణ, పుట్టపాక, మంథని మండలం