సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : నగర జనాభాకు అనుగుణంగా సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే.. ఉన్న సర్వీసులను పండుగ ప్రయాణాలకు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిటీ బస్సులకు స్పెషల్ బస్సుల బోర్డులు తగిలిస్తూ.. ఇక్కడి బస్సుల్లో కోత విధిస్తున్నారు. సుమారు వెయ్యి సిటీ బస్సులను పండుగ ప్రయాణాలకు కేటాయించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.
ఇప్పటికే 200 సర్వీసులు పండుగ ప్రయాణాల్లో ట్రిప్పులు చేస్తున్నాయి. సాధారణంగా గ్రేటర్లో కోటి జనాభాకు కేవలం 2,800 బస్సులు మాత్రమే ఉన్నాయి. సుమారు 7వేల బస్సులు అవసరం ఉందని రవాణారంగ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో రోజువారీ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సులు ప్రయాణికులతో రద్దీని తలపిస్తున్నాయి. గ్రేటర్ జోన్ పరిధిలో ఆర్టీసీ నడుపుతున్న సిటీ బస్సుల్లో రోజు 24 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇందులో సుమారు 16 లక్షల మంది మహిళా ప్రయాణికులే ఉంటున్నారు.
రద్దీ రెట్టింపైనా అధికారులు అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెలవు రోజుల్లో కూడా బస్సుల రాకపోకలను పరిమితం చేస్తున్నారు. రద్దీ ఉన్నప్పటికీ బస్సులను కేటాయించడం లేదు. సాధారణ రోజుల్లో రాత్రి 9 తర్వాత బస్సుల సంఖ్య తగ్గిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు రెట్టింపు డబ్బులు చెల్లించి ఆటోలను, ట్యాక్సీలను ఆశ్రయిస్తున్నారు.
ఇటువంటి పరిస్థితులు 2,800 బస్సులు నడుస్తున్నప్పుడే ఉండగా, ఇప్పుడు ఇందులో వెయ్యి బస్సులను పండుగ ప్రయాణాలకు కేటాయిస్తే నగర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రకాశ్ అనే ప్రయాణికుడు చెప్పాడు. హాస్టల్, విద్యాసంస్థలు, విద్యార్థులంతా కలిసి బస్సులను పండుగ ప్రయాణాలకు వినియోగించుకోవాలని ఆర్టీసీ సూచించినా.. పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ప్రాంతాల వారీగా నంబర్లను సూచించినప్పటికీ ఫోన్ చేస్తే ఆర్టీసీ సిబ్బంది ఎత్తడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. బస్సుల సంఖ్య పెంచాల్సిందిగా ఆర్టీసీకి ప్రయాణికులు ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా ప్రయోజనం ఉండటం లేదని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.