సిటీబ్యూరో, సెప్టెంబరు 23 (నమస్తే తెలంగాణ): మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ అధ్యక్షతన బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూంలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో 14 ఎజెండా అంశాలు, 10 టేబుల్ ఐటెంలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.
స్టాండింగ్ కమిటీ ఆమోదించిన అంశాలు
అల్వాల్ సర్కిల్లోని చిన్నరాముని చెరువు నుంచి దినకర్‌నగర్ వరకు రూ.295 లక్షల అంచనా వ్యయంతో బాక్స్ డ్రైయిన్ నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు కమిటీ ఆమోదం తెలిపింది.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నడిపేందుకు స్నేహిత స్వయం సహాయక సంఘంతో మూడు సంవత్సరాల పాటు ఎంఓయూ కుదుర్చుకునేందుకు కమిటీ ఆమోదించింది.
కేబీఆర్ పార్కు కియోస్క్ నం 8 ఓపెన్ యాక్షన్‌లో కేటాయించాలని స్టాండింగ్ కమిటీ ఆమోదం
145 వార్డు సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు ప్రస్తుతం ఉన్న మెడికల్ ఇన్సూరెన్స్ పొడగింపునకు ఆమోదం
హెచ్ సిటీ ప్రాజెక్టులలో భాగంగా ఆర్కేపురం వద్ద ఆర్వోబీ, ఆర్యూబీ నిర్మాణానికిగానూ 52 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదించింది.
యాకుత్‌పురలోని ఎన్ఆర్టీ కాలనీలో బ్రిడ్జి పునర్నిర్మాణం వ్యయం రూ.295 లక్షలతో ఎన్ఎస్ఎస్ కన్సల్టెంట్ సేవల వినియోగానికి కమిటీ ఆమోదం
మల్లేపల్లిలో రూ.485 లక్షల వ్యయంతో ఫుట్‌బాల్ గ్రౌండ్ ఆధునికీకరణకు కమిటీ ఆమోదం
మౌలాలిలో జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయం భవనం 1వ అంతస్తులో తాత్కాలిక పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు కమిటీ ఆమోదం
శిల్పా హిల్స్ (ఎస్సి శ్మశానవాటిక), కృష్ణానగర్ (హిందూ శ్మశానవాటిక)ను రూ.240 లక్షల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు.
ట్రేడ్ బోర్డ్స్/ ప్రకటన లైసెన్స్ జారీ అధికారాన్ని డిప్యూటీ కమిషనర్లకు అప్పగించడం, అప్పీల్ అధికారులుగా జోనల్ కమిషనర్లను నియమించడం, ఐటీ వింగ్ ద్వారా ప్రకటన మాడ్యుల్ సవరణ చేయనున్నారు.
నాగోల్ సరస్సు నుంచి ఎన్ఎన్డీపీ డ్రైయిన్ వరకు బాక్స్ డ్రైయిన్ నిర్మాణానికి రూ.298 లక్షలకు అనుమతి
జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలు, గొర్రెలు, మేకలు, పశువుల వధశాలలను ప్రతి సంవత్సరం జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రత్యేక సందర్భాల్లో మూసివేయడానికి, జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 533(బి) కమిషనర్‌కు ఇవ్వబడిన అధికారాల ప్రకారం ఆదేశాలు జారీచేశారు.
లోయర్ ట్యాంక్ బండ్ నుంచి సెక్రటేరియట్ వరకు కనెక్ట్ చేసే ఫ్లై ఓవర్‌కు తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్‌గా నామకరణం చేస్తూ కార్పొరేషన్ సిఫార్సుకు ఆ మోదం కోరారు. ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు, అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.