రెంజల్, సెప్టెంబర్ 24: ఈ వానకాలం సీజన్లో గోదావరి నది నాలుగోసారి ఉగ్రరూపం దాల్చింది. మండలంలోని కందకుర్తి గ్రామాన్ని తాకుతూ వరద ప్రవహిస్తున్నది. మహారాష్ట్రలోని విష్ణుపురి, గైక్వాడ్, ఫైఠాన్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతోపాటు నిజాంసాగర్ నుంచి మంజీరాలోకి నీటిని విడుదల చేస్తుండడంతో కందకుర్తి వద్ద వరద తీవ్రంగా ఉన్నది. గోదావరి నది పునాది నుంచి సుమారు 350ఫీట్ల ఎత్తులో వరద ప్రవహిస్తున్నది. దీంతో మంజీరా పరీవాహక ప్రాంతంలోని పొలాలన్నీ ఇప్పటికే నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
నెల రోజుల్లోనే నాలుగు దఫాలుగా వరద ఉధృతితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి అధికారులు చేతులు దులుపుకున్నారని, పరిహారం ఎప్పుడు అందిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. నది ఒడ్డున ఉన్న సంత్ సీతారాం ఆశ్రమంలో తలదాచుకుంటున్న అయోధ్య సాధువులతోపాటు గోశాలలో ఉన్న గోవులను బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి పుష్కర ఘాట్ నది తీరం సుమారు కిలో మీటరు పొడవునా పారుతున్న నీటిలో ట్రాక్టర్ సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రోడ్డుకు అడ్డంగా బారీకేడ్లను ఏర్పాటు చేసి తెలంగాణ- మహారాష్ట్రకు రాకపోకలను నిలిపివేశారు.