బడంగ్‌పేట, సెప్టెంబర్24ః ప్రభుత్వ భూమిని కాజేయడానికి అక్రమణదారులు కన్నేస్తున్నారని తహశీల్దార్ ఇందిరాదేవి తెలిపారు. బాలాపూర్ మండలం జల్పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 75లో దాదాపు 8 గుంటల (వెయ్యి గజాల) ప్రభుత్వ భూమి ఉంది. గత కొంత కాలం నుంచి ఆ భూమిని కాజేయడానికి స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు బిగ్ స్కెచ్ వేశారు. ఏకంగా ఇటాచ్లతో చదును చేసి నిర్మాణాలు చేయడానికి ప్లాన్ వేశారు.
ఈ విషయం తెలిసిన బాలాపూర్ మండల తహశీల్దార్ ఇందిరాదేవి ఆదేశాల మేరకు ఆర్ఐ జమీల్ సర్వే నెంబర్ 75లో ఉన్న ప్రభుత్వ భూమిని సందర్శించారు. ఎందుకు ప్రభుత్వ భూమిలో పనులు చేస్తున్నారని ప్రశ్నించగా అధికారిని బెదింరించిన్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిలో ఎలాంటి పనులు చేయకూడదని చెప్పినా కబ్జాదారులు బరితెగించి చదును చేయడం కొనసాగించారు. దీంతో ఆర్ఐ జమీల్.. తహశీల్దార్‌కు జరిగిన విషయం చెప్పడంతో తహశీల్దార్ ఇందిరాదేవి పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బుధవారం పహాడీషరీప్ పోలీసుల బందోబస్తు మధ్య ఆర్ఐ జమీల్ ఆధ్వర్యంలో సర్వే నెంబర్ 75లో జరుగుతున్న పనులను నిలిపివేయించారు. అయినా అధికారులతో వాగ్వివాదానికి దిగిన్నట్లు ఆర్ఐ పేర్కొన్నారు. దీంతో ఇటాచ్, రెండు ట్రాక్టర్లను సీజ్ చేయించారు. కబ్జాకు పాల్పడిన వ్యక్తులపై పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయించారు. ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని చెప్పారు. కబ్జాలు చేయడమే కాకుండా తమ సిబ్బందిని బెదిరిస్తున్నారని తహశీల్దార్ ఇందిరాదేవి వాపోయారు. ప్రభుత్వ భూములను కాపాడటమే తమ లక్ష్యమని చెప్పారు.