హైదరాబాద్, మార్చి 19(నమస్తే తెలంగాణ) : పార్టీలో, ప్రభుత్వంలో అసలు కాంగ్రెస్ నేతలకు పదవులు ఎండమావిగా మారాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా శాసనసభ, శాసనమండలిలో విప్‌లను ప్రభుత్వం నియమించింది. వీరిలో వలస నేతలకు పెద్దపీట వేయడంపై పార్టీలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. శాసనమండలిలో విప్‌లుగా ఎమ్మెల్సీ లు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌ను నియమించింది.
శాసనసభలో విప్‌లుగా ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వేముల వీరేశంలకు అవకాశం కల్పిస్తూ సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మండలి విప్ల నియామకం అటుంచితే శాసనసభలో విప్ల నియామకంపై పార్టీలో రచ్చకు దారితీసింది. అసలు కాంగ్రెస్ నేతలను పక్కనపెట్టి వలస నేతలకు పదవులు కట్టబెట్టడంపై తీవ్ర విమర్శ లు వ్యక్తమవుతున్నాయి. శాసనసభ విప్‌లుగా నియమితులైన ముగ్గురు కూడా ఇటీవల కాంగ్రెస్‌లోకి చేరిన వారే. ఎన్నో నుంచి పార్టీ జెండా మోసిన వారికి అన్యాయం చేస్తారా అంటూ అసలు కాంగ్రెస్ నేతలు రగిలిపోతున్నారు.