హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : అంగన్వాడీ టీచర్లకు అందజేసే స్మార్ట్ఫోన్ల టెండర్లలో రాష్ట్ర సర్కారు రూ.30 కోట్ల కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. తన శాఖలో ఇంతటి అవినీతి జరుగుతుండగా మంత్రి సీతక్క మౌనం వహించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మంత్రికి తెలిసే అవినీతి జరిగిందని నమ్మాల్సి వస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అంగన్వాడీలకు అందజేసే 38,138 స్మార్ట్ఫోన్ల కాంట్రాక్ట్‌లో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.
స్మార్ట్ఫోన్ల కేటాయింపులో బిడ్ దాఖలు చేసిన కంపెనీకి రూ.54 కోట్లు కేటాయించిందని తెలిపారు. ‘శామ్సంగ్ ఏ 06 మోడల్ (64/4 జీబీ) ఫోన్ ఒక్కో దానికి రూ.11,650 ఖర్చయిందని ప్రభుత్వం చెప్తున్నది. కానీ వాస్తవ ధర పన్నులతో కలిపి రూ.8,249 మాత్రమే. బల్క్‌గా తీసుకొంటే రూ.6500కే వస్తుంది. అంటే ఒక్కో ఫోన్‌కు అదనంగా రూ.5100 వెచ్చించింది. ఈ లెక్కన 38,138 యూనిట్లకు రూ. 20 కోట్లు, మెయింటెనెన్స్ ఖర్చుల పేరిట మరో రూ.10 కోట్లు.. మొత్తంగా రూ.30 కోట్ల అవినీతికి పాల్పడింది..’ అని వివరించారు. ఈ అక్రమసొమ్ము ఏవరి జేబుల్లోకి వెళ్లిందో సంబంధిత శాఖ మంత్రి సీతక్క చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడిన సందర్భంలో 23 సార్లు క్యూర్, ఫ్యూర్, రేర్ అని మాట్లాడారని, స్కాంలు చేయడమే ఈ మోడలా? అని క్రిశాంక్ ప్రశ్నించారు. గొప్పలు చెప్పడంకాదు అంగన్వాడీ స్మార్ట్ఫోన్ల టెండర్లలో రూ.20 కోట్ల కుంభకోణంపై వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీంలో అవినీతి జరుగుతుంటే మోదీ ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. వారంలోగా స్పందించకుంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
