హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : ఉగాది పండుగ దాటినా వేతనాలు అందకపోవడంతో అంగన్వాడీ సిబ్బంది అరిగోస పడాల్సి వస్తున్నది. మార్చి ఒకటో తేదీ పోయి 20వ తేదీ వచ్చినా వేతనం ఖాతాల్లో జమచేయడంలో సర్కార్ విఫలమైంది. ఉద్యోగులందరికీ ఒకటో తారీఖే వేతనాలు ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆచరణలో విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. సంబంధిత శాఖ మంత్రి, అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో అసహనం వ్యక్తమవుతున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతినెలా వేతనాలు ఆలస్యమవుతుండటంతో 70 వేల అంగన్వాడీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తే కొంతకాలం రెండు వారాల్లోగా అందిచారని అంగన్వాడీ యూనియన్ల నాయకులు చెబుతున్నారు. ప్రస్తుత మార్చిలో మాత్రం మూడు వారాలు దాటినా జీతాలు ఇవ్వకపోవడం దారుణమని మండిపడుతున్నారు. కనీసం ఉగాది పండుగకు ముందైనా ఖాతాల్లో జమచేస్తారని ఆశించినా నిరాశే ఎదురైందని వాపోతున్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ టీ చర్ల వేతనాలు రూ. 13,650 నుంచి రూ. 18 వేల కు, హెల్పర్ల జీతాలు రూ. 7800 నుంచి రూ. 12 వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అమలులో మొండి చెయ్యి చూపింది. గద్దెనెక్కి రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీ అమలులో విఫలమైంది. విరమణ బెనిఫిట్స్ విషయంలోనూ ప్ర భుత్వం మాటతప్పిందని అంగన్వాడీ యూనియన్ నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వేతనాలు పెంచుతుందని ఎంతగానో ఆశపడ్డం. కానీ పెంపు సంగతేమోగాని ప్రతినెలా సక్రమంగా ఖాతాల్లో జమచేయడంలేదు. మొదటి తారీఖు రాగానే ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తున్నది. జీతాలు రాకపోవడంతో ఇంటి నిర్వాహణ ఖర్చులకోసం అప్పులు చేయాల్సి వస్తున్నది. ప్రభు త్వం ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీ టీచర్స్, హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలి. ఉద్యోగుల మాదిరిగా ప్రతినెలా ఫస్ట్ తారీఖున వేతనాలు ఖాతాల్లో జమచేయాలె.