న్యూఢిల్లీ, ఆగస్టు 16: బ్యాంకులు వరుసపెట్టి వడ్డీరేట్లను పెంచేస్తున్నాయి. ఈ నెల మొదలు ఇప్పటిదాకా ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన 8 బ్యాంకులు తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల మేర పెంచేశాయి. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), కెనరా, యూకో, ఐడీబీఐ, యెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లున్నాయి. ఓవర్నైట్, నెల, త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక కాలపరిమితి ఎంసీఎల్ఆర్లను ఇవి సవరించాయి. కొన్నైతే రెండేండ్లు, మూడేండ్ల ఎంసీఎల్ఆర్లనూ పెంచాయి. ఇలా వడ్డీరేట్లను పెంచడం ఎస్బీఐకి వరుసగా ఇది మూడో నెల కావడం గమనార్హం. కాగా, గృహ, వాహన, వ్యక్తిగత తదితర అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్ల నిర్ణయానికి ఎంసీఎల్ఆరే బ్యాంకులకు ప్రామాణికం.
దీన్ని పెంచిన ప్రతిసారీ రుణగ్రహీతలు తమ నెలవారీ కిస్తీ (ఈఎంఐ)లను ఇంకా ఎక్కువగా చెల్లించాల్సి వస్తున్నది. లేదంటే రుణ కాలపరిమితైనా (టెన్యూర్) పెరుగుతున్నది. నిజానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను ఏడాదిన్నరగా యథాతథంగానే ఉంచుతున్నది. ప్రస్తుతం రెపో రేటు 6.50 శాతం వద్ద ఉన్నది. ద్రవ్యోల్బణం అదుపు సాకుతో వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండానే ద్వైమాసిక ద్రవ్య సమీక్షల్ని సెంట్రల్ బ్యాంక్ ముగించేస్తున్నది. అయినప్పటికీ బ్యాంకులు మాత్రం రుణాలపై వడ్డీరేట్లను పెంచుతూనే ఉన్నాయి. దీంతో అటు వ్యాపార, పారిశ్రామిక రంగాలపై.. ఇటు రుణగ్రహీతలపై మోయలేనంత భారం పడుతున్నది. ప్రధానంగా రుణ లభ్యత ఖరీదై ఆటో, నిర్మాణ, దాని అనుబంధ రంగాలు దెబ్బ తింటున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నెల 1 నుంచీ..
ఈ నెల 1న పీఎన్బీ, యెస్ బ్యాంక్లు తమ ఎంసీఎల్ఆర్లను పెంచాయి. అన్ని కాలపరిమితులపై 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు పీఎన్బీ ప్రకటించింది. ఇందులో కనిష్టం 8.30 శాతం, గరిష్ఠం 9.20 శాతంగా ఉన్నది. మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయా బ్యాంకులు పేర్కొన్నాయి. హెచ్డీఎఫ్సీ ఆగస్టు 8న కొత్త ఎంసీఎల్ఆర్లను అమల్లోకి తెచ్చింది. 5 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ బ్యాంక్లో కనిష్ట ఎంసీఎల్ఆర్ 9.10 శాతం, గరిష్ఠం 9.45 శాతం. అలాగే ఈనెల 10న యూకో బ్యాంక్ ఎంసీఎల్ఆర్ పెరిగింది. ఆయా టెన్యూర్స్పై 5 బేసిస్ పాయింట్లు పెంచింది. ప్రస్తుతం ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ 8.20 శాతంగా, ఏడాదిది 8.95 శాతంగా ఉన్నది. బీవోబీ, కెనరా బ్యాంక్లు సైతం అన్ని టెన్యూర్స్ ఎంసీఎల్ఆర్ను 5 బేసిస్ పాయింట్లదాకా పెంచాయి. ఆగస్టు 12 నుంచే కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. బీవోబీ ఎంసీఎల్ఆర్ కనిష్టం 8.15 శాతంగా ఉన్నది. కెనరా బ్యాంక్లో కనిష్టం 8.25 శాతం, గరిష్ఠం 9.40 శాతం. ఐడీబీఐ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ కూడా ఈ నెల 12 నుంచే పెరిగింది. కనిష్టం 8.40 శాతంగా, గరిష్ఠం 10.10 శాతంగా ఉన్నది. ఇక ఈ నెల 15న దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెరిగింది. ఓవర్నైట్ నుంచి మూడేండ్లదాకా ఉన్న అన్ని కాలపరిమితులకూ ఈ పెంపు వర్తించింది. కనిష్ట ఎంసీఎల్ఆర్ 8.20 శాతంగా ఉంటే, గరిష్ఠం 9.10 శాతంగా ఉన్నది.
ద్రవ్యోల్బణం తగ్గితే..
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇటీవలి గణాంకాల్లో జూలై నెలకుగాను టోకు, చిల్లర ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగితే అక్టోబర్ ద్రవ్య సమీక్షలో వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ తగ్గిస్తుందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా వ్యాపార, పారిశ్రామిక రంగాల నుంచి ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా ద్రవ్యోల్బణం కట్టడికే కట్టుబడి ఉన్న ఆర్బీఐ.. నిరుడు ఏప్రిల్ నుంచి రెపో రేటును తగ్గించనేలేదు. అయితే గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం ఐదేండ్ల కనిష్టాన్ని తాకుతూ 3.54 శాతానికి దిగొచ్చింది. ఇదే సమయంలో హోల్సేల్ ద్రవ్యోల్బణం కూడా 3 నెలల కనిష్టాన్ని సూచిస్తూ 2.04 శాతంగా నమోదైంది. దీంతో మున్ముందు ఇవి మరింత తగ్గితే రాబోయే ద్రవ్య సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లకు కోత పెట్టడం ఖాయమన్న అభిప్రాయాలున్నాయి.