హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదురొంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. సోమవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో రైతులను ఆదుకునేలా నిర్ణయాలు తీసుకోవాలని ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వడ్లను సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద నిద్రాహారాలు మాని పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదారు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ ముందస్తు సమాచారం ఇచ్చినా వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయకపోవడం, ధాన్యం కేంద్రాల వద్ద వడ్లు తడవకుండా కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించినా, క్షేత్రస్థాయిలో అమలుకాకపోవడం విచారకరమన్నారు. సన్న వడ్లకే రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వస్తున్న వార్తలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.