హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీజేపీలో హనుమాన్ జయంతి రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బుజ్జగించే పనిలో కాషాయ పార్టీ తలమునకలైంది. దీనిలో భాగంగా శనివారం కేంద్రమంత్రి బండిసంజయ్, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతంరావును వెంటేసుకుని ఆకాశ్‌పురి హనుమాన్ గుడిని దర్శించుకున్నారు. గతంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతంరావును ప్రకటించిన సందర్భంలో రాజాసింగ్ ఘాటుగా స్పందించారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి టార్గెట్‌గా కేవలం ఒకే పార్లమెంట్ నియోజకవర్గానికి(సికింద్రాబాద్)కి టికెట్ ఇస్తారా? అని ప్రశ్నించారు. అయితే రాజాసింగ్‌కు పోటీగా శ్రీరామనవమి రోజు ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతంరావు అంబర్‌పేటలో శోభాయాత్ర నిర్వహించడం ఈ వివాదానికి మరింత ఆజ్యంపోసింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్, గౌతంరావును వెంటేసుకుని రాజాసింగ్‌ను కలవడం ఆసక్తికరంగా మారింది. వీరి కలయిక అనంతరం రాజాసింగ్ సైతం తన స్వరాన్ని మార్చారు