ఆదిలాబాద్ : బక్రీద్ పండుగను (Bakrid festival ) శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ముస్లిం మతపెద్దలు, మున్సిపల్, పంచాయతీ, పోలీసు అధికారులతో కలిసి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల 7 వ తేదీన జరుపుకోనున్న బక్రీద్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.
మసీదు, ప్రతి ఈద్గా ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలు చేపేట్టాలని, నీటి సదుపాయాన్ని కల్పించాలని , ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వెటర్నరీ అధికారులు ధ్రువీకరించిన జంతువులను మాత్రమే వినియోగించాలని, వాహనాల్లో తరలించే జంతువులకు అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు ఉండాలని స్పష్టం చేశారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వెస్టేజ్ను ట్రాక్టర్లో వేసినపుడు దానిపై కవర్ వేసి ఉంచాలని మునిసిపల్ కమిషనర్‌కు సూచించారు. జిల్లా వ్యాప్తంగా అక్రమంగా పశువులను తరలించకుండా 8 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే, ఎలాంటి సమాచారం అయినా 100 కు కాల్ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు.