హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : వచ్చే నెల 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహిస్తామని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పినట్టు సమాచారం. గురువారం ఆయన సచివాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు పొంగులేటి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో నూతన ఆర్వోఆర్ చట్టాన్ని ఆమోదింపజేస్తామని చెప్పారు. విద్యుత్తు కొనుగోళ్లపై కమిషన్ నివేదిక, ఇతర అంశాలపైనా చర్చిస్తామని చెప్పారు. డిసెంబర్ 7 నాటికి తమ ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుందని, ఆలోగా మంత్రివర్గ విస్తరణ పూర్తి చేస్తామని తెలిపారు. ప్రభుత్వంలో రెండోస్థానం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కదేనని పొంగులేటి స్పష్టంచేశారు. కొండపోచమ్మ సాగర్ సమీపంలో మాజీ మంత్రి హరీశ్‌రావు భూముల కొనుగోళ్లపై విచారణ జరుపుతున్నామని, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు విషయంలో గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో కులగణన సర్వే పూర్తయి, నివేదిక వచ్చాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని పొంగులేటి చెప్పినట్టు తెలిసింది.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్తారని సమాచారం. డిసెంబర్ 9న సమావేశాలు ప్రారంభిస్తామని మంత్రి చెప్తున్నా.. ఇంకా తేదీ ఖరారు కాలేదని సమాచారం. డిసెంబర్ చివరి వారంలో సమావేశాలు ప్రారంభించాలని, 10 రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఆర్వోఆర్ చట్టంతోపాటు, రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని రూ.15 వేలకు పెంచే అంశంపై, పింఛన్ల సొమ్ము పెంపుపైనా అసెంబ్లీలో ప్రకటన ఉండే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. ఆ తర్వాత జనవరి మొదటి వారంలో సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాకు వెళ్తారని చెప్తున్నారు. దాదాపు 10 రోజులపాటు పర్యటన ఉంటుందని సమాచారం. ఈ ఏడాది ఆగస్టులోనే సీఎం అమెరికాకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ఐదు నెలల్లోనే మరోసారి వెళ్తుండటం గమనార్హం.
డిసెంబర్ 9కి సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనలకు, మంత్రి పొంగులేటి మాటలకు పొంతన లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా విజయోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలోనే పలుమార్లు ప్రకటించారు. అదేరోజు లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. కానీ.. మంత్రి పొంగులేటి మాత్రం డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పడం అనుమానాలకు తావిస్తున్నది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారా? లేదా? అన్నది ప్రశ్నార్థంగా మారింది. అటు అసెంబ్లీ నిర్వహిస్తూనే ఇటు విగ్రహావిష్కరణ, సభ నిర్వహణ సాధ్యం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు సచివాలయంలో ప్రభుత్వం చేపట్టిన వాస్తు మార్పులు, విగ్రహ ఏర్పాటు పనులు గడువులోగా పూర్తవడం అనుమానమే అన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చర్చను పక్కదారి పట్టించేందుకు మంత్రి ద్వారా అసెంబ్లీ సమావేశాల పేరుతో లీకులు ఇచ్చినట్టు విమర్శలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే విగ్రహం విషయాన్ని ప్రజలు మర్చిపోతారని భావిస్తున్నట్టు తెలిసింది.