ఆదిలాబాద్ రూరల్/ఎదులాపురం, జూలై 9 : ఆదిలాబాద్లో ఆషాఢ బోనాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని అతి పురాతనమైన పోచమ్మ ఆలయానికి తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. అమ్మవారికి ఇష్టమైన గారెలు, అప్పాలు నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండాలని వేడుకున్నారు.
లష్కర్ బోనాల ఉత్సవాల్లో డీసీసీబీ చైర్మన్
లష్కర్ బోనాల వేడుకలు ఆదిలాబాద్లో ఘనంగా సాగుతున్నాయి. కేఆర్కే కాలనీలో నిర్వహించిన సామూహిక బోనాల వేడుకలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి పాల్గొన్నారు. మహిళలతో కలిసి డీసీసీబీ చైర్మన్ బోనాలను ఎత్తుకొని పోచమ్మ ఆలయానికి శోభాయాత్రగా బయలుదేరారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో..
ఆదిలాబాద్లో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను నిర్వహించారు. మహిళలు, యువతులు బోనాలు ఎత్తుకొని డప్పుచప్పుళ్ల మధ్య తిర్పెల్లిలోని శ్రీ మహాశక్తి పోచమ్మ ఆలయం వరకు శోభాయాత్రగా తరలివచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆశ్రమ పాల్గొన్నారు.
బోనాల వేడుకల్లో మున్సిపల్ మాజీ చైర్పర్సన్
ఎదులాపురం, జూలై 9 : పట్టణంలోని ద్వారకనగర్, మోచిగల్లీలో చేపట్టిన సామూహిక బోనాల వేడుక శోభాయమానంగా సాగింది. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రంగినేని మనీషా వేడుకలకు హాజరయ్యారు. కాలనీలోని మహిళలు, యువతులతో కలిసి డప్పుచప్పుళ్ల మధ్య బోనాల కుండలను ఎత్తుకొని ఆలయం వరకు శోభాయాత్రగా తరలివచ్చారు. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి బోనాలు సమర్పించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు అనసూయ, లక్ష్మీనారాయణ, చింటు, ఉమా, టిల్లు, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్లో..
ఉట్నూర్, జూలై 9 : ఉట్నూర్ డివిజన్ కేంద్రంతో పాటు గ్రామాల్లో భక్తులు పోచమ్మకు బోనాలు సమర్పించారు. నాటు కోళ్లతో మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు.