ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే పీఎంశ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను వెంటనే రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయకుండా ఆపాలి. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. వీటి కోసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో తగిన కేటాయింపులు జరపాలి.
దేశంలోని వివిధ రాష్ర్టాలతో పాటు మన రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్)లు ప్రారంభమై యాభై ఏండ్లవుతున్నది. ఆ కాలంలో ఐసీడీఎస్ సేవలు అనేక మన్ననలు పొందాయి. ఐసీడీఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేయాలని, ఇం దులో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లను పర్మినెంట్ చేయాలని అనేక సంస్థలు, సుప్రీంకోర్టు, గుజరాత్ హైకోర్టు తెలియజేశాయి. ఈ అంశాలను పరిశీలించి పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను నిర్వహించడం లేదు. పైగా పేద ప్రజలతో పాటు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు నష్టం కలిగించే ఐసీడీఎస్ ప్రైవేటీకర ణ నిర్ణయాలు అనేకం చేసింది. ఇలాంటి పరిస్థితిలో అనేక హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మాం. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మా సమస్యలను పట్టించుకోవడం లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ఓట్ల కోసం ఎన్నికల ముందు మమ్మల్ని వాడుకుని, ఇప్పుడు విస్మరిస్తున్నారు. దీని ప్రభావం అంగన్వాడీ కేంద్రాలపై పడుతున్నది. అధికారంలోకి వచ్చిన అనంతరం అంగన్వాడీల వ్యతిరేక విధానాలు అమలు చేయాలని చూడడం అన్యాయం. ఐసీడీఎస్, అంగన్వాడీలకు పోటీగా 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలతో పీఎంశ్రీ పథకం కింద ప్రీ ప్రైమరీ (ఎలిమెంటరీ) కేంద్రాలను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. ఈ మేరకు 28 జిల్లాల్లో కలిపి 56 కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం చూస్తున్నది. అయితే ఈ నిర్ణయం ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే చర్యలు తప్ప మరొకటి కాదు.
రాష్ట్రంలో మొబైల్ అంగన్వాడీ సేవల పేరుతో ప్రభుత్వం కొత్త విధానాన్ని తెస్తుందని తెలిసింది. ఇది కూడా ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే చర్యనే. దీనివల్ల అంగన్వాడీ కేంద్రంలో టీచర్లు, హెల్పర్లు అందించే సేవలు ప్రజలకు దూరమవుతాయి. ఇవేవీ లేకుండా కేవలం ప్రజలకు టీహెచ్ఆర్ ఇస్తే సరిపోతుందని ప్రభుత్వం చెప్పకనే చెప్తున్నది. వీటితో పాటు వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం చూస్తున్నది. మొత్తంగా ఐసీడీఎస్ను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం చూస్తున్నది. ఇవన్నీ అమలు జరిగితే రాష్ట్రంలో క్రమంగా ఐసీడీఎస్ బలహీనపడి శాశ్వతంగా మూతపడే ప్రమాదం ఉన్నది. పేద ప్రజలతో పాటు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు నష్టం కలిగించే ఇలాంటి నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి.
పై అంశాలతో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. 24 రోజుల సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాటాల సందర్భంగా ఇచ్చిన హామీలను, అంగన్వాడీలకు సుప్రీంకోర్టు, గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పులను వెంటనే అమలు చేయాలి. వీటి పరిష్కారం కోసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేటాయింపులు పెంచాలని కోరుతున్నాం. ఇప్పటికే ఈ నెల 17, 18 తేదీల్లో అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయతలపెట్టాం. ఈ మేరకు అక్కడే 48 గంటల వంటావార్పు వంటి కార్యక్రమం నిర్వహిస్తున్నం. మా సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్తు కార్యాచరణ కూడా ఉంటుంది. ఇప్పటికైనా మా న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలి.
వేతనాలు ప్రతి నెల 1వ తేదీన చెల్లించాలి. ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలి. ఈ నిధులను ఐసీడీఎస్కే కేటాయించాలి. మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేయాలి. పాత విధానంలోనే ఐసీడీఎస్ను కొనసాగించాలి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని అమలు చేసే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం పర్మినెంట్ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తన మ్యానిఫెస్టోలో పొందుపరిచిన హామీల ప్రకారం రూ.18 వేల వేతనం చెల్లించాలి. వారికి పీఎఫ్ సౌకర్యం కల్పించాలి. మినీ అంగన్వాడీ నుంచి మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసినందువల్ల 4 వేల మంది అంగన్వాడీలకు 10 నెలల నుంచి జీతాలు నిలిపివేశారు. వాటిని వెంటనే విడుదల చేయాలి. మంత్రి సీతక్క ఇచ్చిన హామీ ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్లు టీచర్లకు రూ. 2 లక్షలివ్వాలి. పెన్షన్, వీఆర్ఎస్ తదితర 23 డిమాండ్లను నెరవేర్చాలి.