న్యూఢిల్లీ, జనవరి 6: న్యాయమూర్తుల నియామకం విషయంలో సుప్రీంకోర్టుతో కొనసాగుతున్న వివాదంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తున్నది. కోర్టు నిర్దేశించిన గడువులోగా కొలీజియం సిఫారసులకు ఆమోదం తెలుపడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. రెండు మూడు రోజుల్లో 44 మంది నియామకంపై నిర్ణయం తీసుకోనున్నట్టు పేర్కొన్నది. ఈ మేరకు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానానికి వెల్లడించారు. హైకోర్టు జడ్జీల బదిలీకి కొలీజియం చేసిన సిఫారసులపై జాప్యం చేయడం వల్ల అడ్మినిస్ట్రేషన్‌పై ప్రభావం పడడమే కాకుండా, ‘థర్డ్‌పార్టీ’ జోక్యం చేసుకుంటున్నదనే భావన కలుగుతుందని కోర్టు పేర్కొన్నది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఐదుగురు జడ్జిలకు పదోన్నతి కల్పించాలని కోరుతూ గత నెలలో కొలీజియం చేసిన సిఫారసుల గురించి ఈ సందర్భంగా కోర్టు ఏజీని ప్రశ్నించింది.
దీనిపై తనకు కొంత సమయం కావాలని ఆయన కోర్టును కోరారు. హైకోర్టుల కొలీజియంలు చేసిన 104 సిఫారసులు ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, ఈ వారాంతానికి 44 సిఫారసులపై నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. న్యాయమూర్తుల నియామకాల్లో జాప్యానికి సంబంధించిన పిటిషన్లపై జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఓకాతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా జడ్జిల బదిలీల గురించి ధర్మాసనం స్పందిస్తూ.. ‘వాస్తవానికి, ఈ అంశంలో ప్రభుత్వం పాత్ర పరిమితమే. అడ్మినిస్ట్రేషన్ పరంగా పలువురు జడ్జిలను బదిలీ చేయాలని కొలీజియం సిఫారసు చేసినప్పుడు, దాన్ని పెండింగ్‌లో పెట్టడం వల్ల తప్పుడు సంకేతం ఇచ్చినట్టువుతుంది. ఇతర అంశాలు ఇందుకు కారణమన్న సంకేతం పంపినట్టవుతుంది. ఇది కొలీజియంకు సమ్మతం కాదు’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. హైకోర్టు జడ్జిల బదిలీకి సంబంధించి ప్రభుత్వం వద్ద 10 సిఫారసులు పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనం పేర్కొన్నది.
ఇది ఆందోళనకరం విషయం..
కొలీజియం రెండోసారి పంపిన పేర్లనూ కేంద్రం తిప్పిపంపుతున్న విషయాన్ని పిటిషనర్ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ లేవనెత్తారు. ఇది ఆందోళనకర అంశమని ధర్మాసనం పేర్కొన్నది. సిఫారసుపై ప్రభుత్వానికి సొంత అభిప్రాయాలు ఉండొచ్చని, అయితే ఆ అభ్యంతరాలు చెప్పకుండా పెండి ంగ్‌లో పెట్టడం సరికాదని స్పష్టంచేసింది. అభ్యంతరాలు చెబితే వాటిని పరిశీలించి ఆ పేరును మళ్లీ పంపాలా వద్దా అని తాము నిర్ణయం తీసుకుంటామని, మళ్లీ తాము ఆ పేరు పంపినట్లయితే ఆ నియామకాన్ని అడ్డుకోవడానికి వీలులేదని తెలిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది.